ముంపు ముప్పునకు శాశ్వత చెక్: రంగంలోకి హైడ్రా రంగనాథ్ ఉన్నతాధికారుల బృందం!

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విస్తృత పర్యటన.. వరద నివారణ చర్యలపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సమీక్ష

ముంపు ముప్పునకు శాశ్వత చెక్: రంగంలోకి హైడ్రా రంగనాథ్ ఉన్నతాధికారుల బృందం!

హైదరాబాద్:

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని ముంపు ప్రాంతాల్లో బుధవారం హై లెవెల్ కమిటీ విస్తృతంగా పర్యటించింది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ పర్యటనలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్, హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అశోక్‌రెడ్డి, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య సహా ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత వర్షాకాలంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం, వరద ముప్పునకు గల కారణాలను విశ్లేషించి, తక్షణ ప్రత్యామ్నాయాలపై చర్చించింది.
### ప్రకాష్‌నగర్, బేగంపేటల్లో మారిన చిత్రపటం: హైడ్రా పనులకు సత్ఫలితాలు
అధికారుల బృందం మొదట ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారితో పాటు చికోటీ గార్డెన్స్ పరిసరాలను పరిశీలించింది. గతంలో స్వల్ప వర్షానికే ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్ ప్రాంతం జలమయమయ్యేదని, అయితే గత ఏడాది హైడ్రా ఆధ్వర్యంలో భూగర్భ డ్రైనేజీలో పెద్ద ఎత్తున పూడికతీత పనులు చేపట్టడం వల్ల ఇప్పుడు పరిస్థితి మెరుగైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.
బేగంపేట విమానాశ్రయం నుండి పోటెత్తే వరదను నియంత్రించేందుకు అక్కడ 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన సంరక్షణ చెరువు (రిటెన్షన్ పాండ్) మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టాన్ని ముందస్తుగా తగ్గిస్తే ఈ ప్రాంతంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు.WhatsApp Image 2026-06-17 at 17.30.34

*ఉప్పల్, ఎల్‌బీనగర్‌లలో ముమ్మర తనిఖీలు:
 ఉప్పల్ క్రాస్‌రోడ్స్ సంపు పరిశీలన: ఉప్పల్ చౌరస్తాలో రహదారులు జలమయం కాకుండా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన 5 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ సంపును (వాటర్ సంప్) అధికారులు తనిఖీ చేశారు. ఈ సంపు వల్ల చౌరస్తాలో వరద నీరు నిల్వ ఉండకుండా వేగంగా తరలిపోతోందని జలమండలి అధికారులు వెల్లడించారు. అలాగే ఉప్పల్ నల్లచెరువు పునరుద్ధరణ పనుల వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వరద ముప్పు తప్పిందని స్పష్టం చేశారు.

 *ఎల్‌బీనగర్ కాలువల అనుసంధానం: ఎల్‌బీనగర్ క్రాస్‌రోడ్స్ బస్ స్టాప్ సమీపంలో బైరాముల్‌గూడ చెరువుకు వెళ్లే వరద కాలువల (స్టార్మ్‌ వాటర్ డ్రెయిన్స్) స్థితిగతులను బృందం పరిశీలించింది. చంద్రపురి కాలనీ - గుంటి జంగయ్య కాలనీలను కలుపుతూ ప్రధాన రహదారిలో 900 మిల్లీమీటర్ల (ఎంఎం) వరద కాలువ నిర్మిస్తే ఇక్కడి సమస్య పరిష్కారమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

*విజయవాడ జాతీయ రహదారిపై ప్రత్యేక నాలాల నిర్మాణం
వనస్థలిపురంలోని కేఎల్ఎమ్ షాపింగ్ మాల్‌కు ఎదురుగా జాతీయ రహదారి (నేషనల్ హైవే) నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసిన నాలాలను, వరద కాలువల అనుసంధాన ప్రక్రియను ఉన్నతాధికారులు పరిశీలించారు. విజయవాడ హైవేకు అడ్డంగా సొరంగం (టన్నెల్) తరహాలో తవ్వకాలు జరిపి, గత ఏడాది ఏర్పాటు చేసిన పైపులైన్లను తనిఖీ చేశారు.WhatsApp Image 2026-06-17 at 17.30.33

మరో పైపులైన్‌కు ప్రతిపాదన:
ఎఫ్‌సీఐ కాలనీ, ప్రశాంత్‌నగర్, అభ్యుదయ నగర్, చింతలకుంట గ్రామాల నుండి భారీగా వచ్చే వరద నీరు జాతీయ రహదారిని దాటి మన్సూరాబాద్ పెద్ద చెరువుకు చేరేలా మరో 1000 మిల్లీమీటర్ల (ఎంఎం) పైపులైను నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులు ప్రభుత్వ సలహాదారు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో తీవ్రంగా ఉన్న ఈ సమస్య, ఇప్పటికే 1.10 మీటర్ల పైపులైన్ వేయడంతో చాలా వరకు తగ్గిందని, అదనంగా మరో లైన్ నిర్మిస్తే ముంపు సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని అధికారులు నివేదించారు.

About The Author