‘మీ సురక్ష’తో సురక్షిత సమాజం: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ 30 రోజుల పురోగతి నివేదిక

‘మీ సురక్ష’తో సురక్షిత సమాజం: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ 30 రోజుల పురోగతి నివేదిక

హైదరాబాద్

ప్రజా భాగస్వామ్యం ద్వారా సురక్షితమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మీ సురక్ష" కార్యక్రమం విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుంది. గృహ సహాయకులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, అద్దెదారులు మరియు తాత్కాలిక నివాసితుల సమగ్ర సమాచార సేకరణ, ధృవీకరణే లక్ష్యంగా 2026 మే 16న ఈ గొడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, కార్యక్రమం ప్రారంభించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా జూన్ 16న 30 రోజుల పురోగతి నివేదికను కమిషనరేట్ విడుదల చేసింది.

*విస్తృత ప్రచారం – ముమ్మర గణన
ఈ కార్యక్రమం కోసం పోలీస్ స్టేషన్ల పరిధులను కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ అసోసియేషన్ల ప్రాతిపదికన 4,12,308 నివాస క్లస్టర్లుగా విభజించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో కలిపి 580 ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. క్లస్టర్ల వారీగా రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది ఇప్పటివరకు వివిధ వర్గాలకు చెందిన 48,024 మంది గృహ సహాయకులు, సహాయక సిబ్బంది వివరాలను నమోదు చేశారు. సేకరించిన సమాచారం ఆధారంగా సమగ్ర బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

*క్షేత్రస్థాయిలో 175 పోలీస్ బృందాలు
పురోగతి నివేదిక సమర్పణలో భాగంగా జూన్ 16న అన్ని హోదాల పోలీస్ అధికారులతో కూడిన 175 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయి. నివాస ప్రాంతాలను సందర్శించి, స్థానికులతో ముఖాముఖిగా మాట్లాడి "మీ సురక్ష" సాధించిన పురోగతిని వివరించాయి. ఈ పర్యటనల్లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి, IPS స్వయంగా పాల్గొని పౌరులకు ప్రగతి నివేదికను అందించగా, డిప్యూటీ కమిషనర్స్ (DCPs), అడిషనల్ DCPs, అసిస్టెంట్ కమిషనర్స్ (ACPs), ఇన్‌స్పెక్టర్లు సహా ఇతర అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ప్రధాన లక్ష్యాలు:
 సమగ్ర డేటాబేస్: ధృవీకరించబడిన గృహ సహాయకులు, సహాయక సిబ్బంది సమాచారంతో బలమైన డేటాబేస్ ఏర్పాటు.
 *నేరాల నియంత్రణ:ముందస్తు భద్రతా ముప్పుల గుర్తింపు, అవకాశం బట్టి జరిగే నేరాల తగ్గింపు.
 *త్వరిత దర్యాప్తు: పోలీసుల స్పందన సమయాన్ని తగ్గించడం, దర్యాప్తు సామర్థ్యాన్ని మెరుగుపరచడం.
 *మహిళలు, వృద్ధులకు రక్షణ: సమాజంలో హాని కలిగే అవకాశం ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం.

*రుతుపవనాల సన్నద్ధతపై అవగాహన
భద్రతా పరిరక్షణతో పాటు, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని "సమన్వయ రుతుపవనాల సన్నద్ధత ప్రణాళిక"పై కూడా పోలీస్ బృందాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. రహదారులపై నీరు నిలిచే ప్రాంతాలు, గుంతలు, తెరచి ఉన్న మ్యాన్‌హోళ్లు వంటి ప్రజా రక్షణకు భంగం కలిగించే సమస్యలను తక్షణమే నివేదించాలని, వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులను కోరాయి.
మరింత సురక్షితమైన, సంక్షేమ సమాజ స్థాపన కోసం కాలనీల నివాసితులు, సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ కమ్యూనిటీలు "మీ సురక్ష" కార్యక్రమానికి తమ నిరంతర సహకారాన్ని అందించాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పిలుపునిచ్చింది.WhatsApp Image 2026-06-16 at 20.32.49

About The Author