అక్రమ ఇసుక మాఫియాపై మైనింగ్ విజిలెన్స్ ఉక్కుపాదం..!
- ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సాగిన ఇసుక దందా బట్టబయలు
- 15 ట్రాక్టర్ల స్వాధీనం..9 ట్రాక్టర్ల పై కేసు నమోదు విజిలెన్స్ దాడులతో పరారైన డ్రైవర్లు
- యాలాల-తాండూర్‌లో ఇసుక అక్రమ రవాణాకు చెక్
- సడెన్ ఆపరేషన్‌తో ఇసుక మాఫియాకు భారీ షాక్
- నేషనల్ హైవే, ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో ఇసుక దోపిడీ
తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక మాఫియాపై మైనింగ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖ కొరడా ఝుళిపించింది. ఇందిరమ్మ ఇండ్లు, నేషనల్ హైవే పనుల పేరుతో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక రవాణాపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి మొత్తం 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంది.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డీజీ డి.ఎస్. చౌహన్, హైదరాబాద్ రూరల్ ఎస్పీ అశోక్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు యాలాల, తాండూర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించి అడ్డుకున్నారు.
విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న డ్రైవర్లు, కూలీలు ట్రాక్టర్లను అక్కడికక్కడే వదిలేసి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 9 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసిన అధికారులు, మిగిలిన వాహనాల యజమానులు, నిర్వాహకుల వివరాలను సేకరిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, నేషనల్ హైవే పనుల పేరుతో కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారని అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు.
తాండూర్, యాలాల మండలాల్లో గత కొంతకాలంగా విస్తృతంగా కొనసాగుతున్న ఇసుక దందాపై విజిలెన్స్ శాఖ చేపట్టిన ఈ సడెన్ ఆపరేషన్‌తో ఇసుక మాఫియాలో కలకలం రేగింది. భవిష్యత్తులో కూడా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
