మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం

  • ఎల్ అండ్ టీ’ నుంచి మెట్రో స్వాధీనం.. కేంద్రం ఆంక్షల వల్లే ఈ నిర్ణయం
  • *జపాన్ నిధులను అడ్డుకుంటున్న కిషన్ రెడ్డి.. సీఎం సంచలన ఆరోపణలు

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: 

అంతర్జాతీయ నగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మలిదశ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వైఖరి, పాత ప్రభుత్వ నిర్వాకాలపై పత్రికా ముఖంగా జంటనగరాల ప్రజలకు, 'కోర్' (CURE) పరిధిలోని నివాసితులకు వాస్తవాలను వివరించారు.

*కాంగ్రెస్ దార్శనికత.. గత ప్రభుత్వ అలసత్వం
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రవాణా వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిందని సీఎం గుర్తుచేశారు. ఆనాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు మంజూరైందని, వై.ఎస్. మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెట్రో మొదటి దశ (ఫేజ్-1) కొరకు ఒప్పందాలు జరిగాయని వివరించారు.

 "2017 నాటికే పూర్తి కావాల్సిన మెట్రో మొదటి దశను, తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చారిత్రక కట్టడాల సాకుతో అడ్డుకుంది. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమైంది. దీనివల్ల రూ. 15 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ. 22 వేల కోట్లకు చేరింది."
       ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాజెక్టు ఆలస్యం కావడం, దానికి తోడు కోవిడ్ (కరోనా) ప్రభావం వల్ల మెట్రో నిర్మాణ సంస్థ 'ఎల్ అండ్ టీ' తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో మెట్రో విస్తరణను పూర్తిగా విస్మరించిన నాటి ప్రభుత్వం, తమ సొంత ఆస్తులను పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిందని, ఫలితంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉండాల్సిన హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని దుయ్యబట్టారు.

*కేంద్ర ప్రభుత్వ నిబంధనలు - రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయాలు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో రెండో దశ (ఫేజ్-2) విస్తరణకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా తానే స్వయంగా ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, మొదటి దశను నిర్మించిన 'ఎల్ అండ్ టీ' సంస్థతోనే రెండో దశను కూడా నిర్మించాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం విధించిందని పేర్కొన్నారు.
రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తిని సృష్టించినప్పటికీ, ఏటా రూ. 400 కోట్ల నష్టం వస్తోందని, గత నష్టాల భారం వల్ల తాము రెండో దశ నిర్మాణంలో భాగస్వామ్యం కాలేమని, భవిష్యత్ నిర్వహణను కూడా చేపట్టలేమని 'ఎల్ అండ్ టీ' సంస్థ స్పష్టంగా తిరస్కరించిందని సీఎం వెల్లడించారు.

*ఏకైక పరిష్కారం: మెట్రో స్వాధీనం
ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించగా, 'ఎల్ అండ్ టీ' సంస్థ నుంచి మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక మార్గమని కేంద్రం సూచించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం సూచనల మేరకే రూ. 30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం రూ. 15  వేల కోట్లకే కొనుగోలు చేసిందని ఆయన ప్రకటించారు.

*కిషన్ రెడ్డి అడ్డంకులు.. నిధుల నిలిపివేత
బ్యాంకుల నుంచి 8.25 శాతం వడ్డీకి 'ఎల్ అండ్ టీ' తీసుకున్న రూ. 13,600 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి పీఎఫ్‌సీ (PFC), ఆర్‌ఈసీ (REC) సంస్థల ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండా, ఎవరికీ తెలియకుండా 9 నుండి 11.5 శాతం భారీ వడ్డీతో రూ. 3 లక్షల 15 వేల కోట్ల అప్పులను కేంద్రం మంజూరు చేసిందని విమర్శించారు.
అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే జపాన్ ఆర్థిక సంస్థ నుండి రూ. 13,600 కోట్ల రుణాన్ని తీసుకువచ్చేలా ఒప్పందం కుదుర్చుకుందని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,400 కోట్లను కూడా చెల్లించిందని సీఎం వివరించారు.

జపాన్ సంస్థ ఇప్పటికే నిధులను ఐఆర్‌ఎఫ్‌సీకి విడుదల చేసినప్పటికీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ కుట్రలతో ఆ నిధులను రాష్ట్రానికి బదిలీ కాకుండా అడ్డుకుంటున్నారని సీఎం సంచలన ఆరోపణ చేశారు. మే 20న కేంద్ర మంత్రి ఖట్టర్‌ను, మే 21న అశ్వినీ వైష్ణవ్‌ను కిషన్ రెడ్డి స్వయంగా కలిసి ఈ రుణాన్ని నిలిపివేయాలని కోరడం దారుణమన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను ఒప్పించిన లేఖను సమర్పించినా లోన్ ట్రాన్స్‌ఫర్‌ను అడ్డుకున్నారని, దీనివల్ల వృథాగా పెరుగుతున్న వడ్డీ భారాన్ని కిషన్ రెడ్డే భరించాలని డిమాండ్ చేశారు.

*రాజకీయ వివక్షపై సీఎం సూటి ప్రశ్నలు
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలను సంధించారు:
 * సికింద్రాబాద్ ఎంపీగా, తెలంగాణ ప్రతినిధిగా ఉండి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరంగల్ విమానాశ్రయం పనుల వేగం పెరిగిన తరుణంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి ఆ పనులను ఎందుకు మందగించేలా చేశారు?

 *కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడినా నోరు మెదపని కిషన్ రెడ్డి, తాము ప్రజా ప్రయోజనాల కోసం అడుగుతుంటే ఎందుకు సవాళ్లు విసురుతున్నారు? కిషన్ రెడ్డి వెనుక ఉండి కేటీఆర్ ఈ కుట్రలను నడిపిస్తున్నారా?

 * అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం నగరాలకు మెట్రో నిధులను మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణపై ఈ స్థాయి వివక్షను ఎందుకు ప్రదర్శిస్తోంది?

*తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి..
"122 కిలోమీటర్ల మెట్రో రెండో దశ నిర్మాణంలో కేంద్రం భాగస్వామిగా ఉంటుందో లేదో స్పష్టం చేయాలి. మీకు కష్టంగా ఉంటే మీ 50 శాతం భాగస్వామ్యం మాకు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిరభ్యంతర పత్రం (NOC) ఇస్తే, పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి మెట్రో విస్తరణను పూర్తి చేసుకుంటుంది. రాజకీయాల కోసం నేను మాట్లాడటం లేదు.. మెట్రో మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకుని, రెండో దశను విజయవంతంగా పూర్తి చేయడమే మా లక్ష్యం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

About The Author