ఆర్యవైశ్యులు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఆర్యవైశ్యులు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

*హైదరాబాద్:

తెలంగాణ సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో ఆర్యవైశ్యుల పాత్ర అనన్యసామాన్యమైనదని ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నాడు. గ్రామీణ ప్రాంతంలోని కిరాణా దుకాణం నుంచి మహానగరాల్లోని భారీ పరిశ్రమల వరకు తమదైన పాత్ర పోషిస్తూ, సప్లై చైన్ వ్యవస్థకు వారు వెన్నుముకలా నిలుస్తున్నారని తెలిపాడు.
హైదరాబాద్‌ చంపాపేట్‌లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల అభినందన సత్కారం, సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యాడు. రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఆర్యవైశ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.

*ప్రజాసేవను వరంగా భావించాలి
ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా ప్రజాసేవను గొప్పవరంగా భావించాలని ఎమ్మెల్యే సూచించాడు. వ్యాపార ధర్మం పాటించడంలో, లాభాలను సమాజ శ్రేయస్సుకు వెచ్చించడంలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నాడు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూరుస్తూ, రాష్ట్ర సంక్షేమ పథకాల అమలుకు వారు పరోక్షంగా అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఆర్యవైశ్యుల్లోనూ అనేక మంది పేదలు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించాడు.

About The Author