*యువతరమే దేశానికి దిక్సూచి: సీ.పీ.ఎం శంఖారావం.

  • పెట్టుబడిదారుల చేతుల్లో బందీగా దేశ ఆర్థిక వ్యవస్థ!
  • *అమెరికా ఆంక్షలను ఎదుర్కొనలేని దుస్థితిలో కేంద్రం!
  • *హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం!
  • *సమ సమాజ స్థాపన కోసం యువతరం కదలాలి: జాన్ వెస్లీ, బీవీ రాఘవులు

*యువతరమే దేశానికి దిక్సూచి: సీ.పీ.ఎం శంఖారావం.

పెట్టుబడిదారుల చేతిలో బందీ అయిన ఆర్థిక వ్యవస్థ, అమెరికా అడుగులకు మడుగులొత్తే కేంద్ర విధానాలు, ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన రాష్ట్ర సర్కారు.. వెరసి నేటి రాజకీయ చదరంగంలో సామాన్యుడు బలిపశువు అవుతున్నాడు. ట్రంప్ పేరుతో రోడ్లకు రంగులు పూస్తూ, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్న పాలకుల దివాళాకోరుతనానికి అద్దం పట్టింది కొత్తపేట యువ సమ్మేళనం. ఆరు గ్యారంటీల ముసుగులో రైతులను నడిసముద్రంలో ముంచిన పాలకుల నిద్రమత్తు వదిలించాలంటే, కేవలం ఓటర్లుగా మిగిలిపోతున్న యువతరం ఇకనైనా మేల్కొని కదం తొక్కాలి. వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు యువశక్తే అసలైన దిక్సూచి కానుంది.

*ఎల్బీనగర్:
యువశక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని, పెట్టుబడిదారుల కరడుగట్టిన పిడికిలి నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి యువతరం కదం తొక్కాలని సీపీఎం (భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్టు) పిలుపునిచ్చింది. మంగళవారం కొత్తపేటలోని బీజేఆర్ భవనంలో నిర్వహించిన ‘యువ కమ్యూనిస్టుల సమ్మేళనం’ దేశ రాజకీయాల్లో మార్పుకు వేదికైంది. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆవిష్కరించారు.

*దేశ భవిష్యత్తు తాకట్టు: బీవీ రాఘవులు తీవ్ర విమర్శలు
సమ్మేళనంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ భవిష్యత్తును అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 "భారత నావికులను పొట్టనబెట్టుకుంటున్నా అమెరికాను ప్రశ్నించే ధైర్యం ప్రధానికి లేదు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి మోదీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం దారుణం. దేశ ప్రయోజనాలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ప్రధాన శత్రువులే."
          * బీవీ రాఘవులు..

మన దేశ ఉత్పత్తులపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని ఒక ప్రధాన రహదారికి పెట్టడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి, సిగ్గుచేటైన చర్యకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు మోదీ ప్రభుత్వ సార్వభౌమత్వానికి మోకరిల్లుతున్నాయని విమర్శించారు.

*ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ: రాజ్యసభ సభ్యుడు రహీం
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరాయని రాజ్యసభ సభ్యుడు రహీం ఆరోపించారు. గ్రామీణ ఉపాధికి వెన్నుముకగా నిలిచిన ‘ఉపాధి హామీ పథకాన్ని’ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేసిందని స్పష్టం చేశారు. దేశ నౌకలపై దాడులు జరుగుతున్నా కేంద్రం మౌనం వహించడాన్ని తప్పుబడుతూ, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

*ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ?: జాన్ వెస్లీ
సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తూ పేదల పక్షాన నిలిచే ఏకైక శక్తి కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు.
 రైతాంగ వ్యతిరేక విధానాలు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. సకాలంలో రైతు బంధు పెట్టుబడి సాయం అందించలేదు.

 *కొనుగోళ్లలో వైఫల్యం: 
ధాన్యం కొనుగోలు ప్రక్రియను అస్తవ్యస్తం చేసి రైతులను నడిసముద్రంలో ముంచారు. ఈ రైతు వ్యతిరేక విధానాలకు రాబోయే రోజుల్లో పాలకులు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
యువత కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి సమ సమాజ స్థాపన కోసం ఉద్యమించాలని జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.

*సమ్మేళనంలో పాల్గొన్న ముఖ్యాతిథులు
ఈ మహాసభలో సీపీఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమోహన్, ప్రముఖ నాయకులు తోట రమేశ్, పగడాల యాదయ్య, నర్సింహ, గోపి నాయక్, కట్ట శ్రీనివాస్, ఆలేటి ఎల్లయ్య, కీసరి నర్సిరెడ్డిలతో పాటు డీవైఎఫ్ఐ (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య), ఎస్ఎఫ్ఐ (భారత విద్యార్థి ఫెడరేషన్) విభాగాల ప్రతినిధులు, విద్యార్థి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-16 at 19.46.33

About The Author