హైదరాబాదులో కాక్రోచ్ ల హల్చల్..!

  • లీకేజీలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సమరభేరి: ధర్నాచౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
  • *పరీక్షల కుంభకోణాలపై విరుచుకుపడ్డ సోనమ్ వాంగ్‌చుక్, ఆకునూరి మురళి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.

హైదరాబాదులో కాక్రోచ్ ల హల్చల్..!

హైదరాబాద్:
దేశ విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న పరీక్షా పత్రాల లీకేజీలు, అవకతవకలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్ వేదికగా సాగిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ముఖ్య అతిథులుగా హాజరై విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. పరీక్షల లీకేజీలతో రోడ్డున పడ్డ వేలాది మంది యువత, విద్యార్థులు ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు భారీ నినాదాలతో డిమాండ్ చేశారు.

*యువతను ‘కాక్రోచ్‌లు’ అంటారా?: ఆకునూరి మురళి తీవ్ర ఆగ్రహం
ధర్నాను ఉద్దేశించి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలోని సంపద పంపిణీ, నిరుద్యోగ సంక్షోభంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అపారమైన సంపద ఉన్నప్పటికీ, అది కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, సామాన్య యువతకు నిరుద్యోగమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 "దేశ సంపద అంతా ఎక్కడికి పోతోంది? నిరుద్యోగం ఎందుకు ఇంతలా పెరుగుతోంది? హక్కుల కోసం పోరాడే యువతను 'కాక్రోచ్‌లుగా' (బొద్దింకలుగా) అవమానించడం ఏంటి? దేశంలో కేవలం ఆరు శాతం యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి మిగిలిన 94 శాతం మందికి ఆ నైపుణ్య శిక్షణ ఎందుకు అందడం లేదు? దీనికి ప్రభుత్వాల వైఫల్యమే కారణం కాదా?" అని ఆకునూరి మురళి ప్రశ్నించారు.

WhatsApp Image 2026-06-14 at 18.20.43 (1)
లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని, వీరందరికీ తీవ్ర అన్యాయం జరిగిందని నిరసనకారులు ఆరోపించారు. దేశంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని స్థితిలో విద్యాశాఖ ఉందనడానికి ఈ కుంభకోణాలే నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని, దేశ భవిష్యత్తుతో ఆడుకున్నందుకు ఆయనను అవసరమైతే జైలుకు పంపాలని కూడా ఆకునూరి మురళి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ధర్నాచౌక్ పరిసరాల్లో నిరసనకారులు భారీగా గుమిగూడటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొంతసేపు తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లీకేజీలపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.WhatsApp Image 2026-06-14 at 18.20.43

About The Author