*రైతులకు దగా: రూ. 30 లక్షల నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు!
- *మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, త్రిమల్గెరి పోలీసుల ఉమ్మడి ఆపరేషన్
- *ముగ్గురు నిందితుల అరెస్ట్.. 2,000 కిలోల విత్తనాలు,12,800 నకిలీ పౌచ్‌లు స్వాధీనం
*హైదరాబాద్
లాభాల వేటలో పడి అన్నదాతను నిలువునా ముంచేందుకు సిద్ధమైన నకిలీ విత్తనాల ముఠా ఆటను పోలీసులు కట్టడి చేశారు. నకిలీ, సర్టిఫికేషన్ లేని పత్తి విత్తనాలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మల్కాజ్‌గిరి ఎస్ఓటీ (ఎస్.ఓ.టి) టీమ్-II, త్రిమల్గెరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 లక్షల విలువైన 2,000 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 12,800 నకిలీ పౌచ్‌లు, ఒక మారుతి ఈకో వాహనం, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
*బ్రాండ్ కాపీ కొట్టి.. బరితెగించి!
గుజరాత్‌కు చెందిన ప్రముఖ "నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్" కంపెనీ బ్రాండ్‌ను తలపించేలా నకిలీ పౌచ్‌లను ముద్రించి, మార్కెట్లోకి వదిలేందుకు నిందితులు వ్యూహం రచించారు. దీనిపై సమాచారం అందుకున్న సదరు కంపెనీ ప్రతినిధి సోలంకె యశ్వంత్ రావు త్రిమల్గెరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన "న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ" మేనేజింగ్ డైరెక్టర్ యెరువ బాలశౌరి రెడ్డి (శివారెడ్డి) ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
*బోయిన్‌పల్లి మార్కెట్ వద్ద నాకా బందీ
ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఎస్ఓటీ, త్రిమల్గెరి పోలీసులు త్రిమల్గెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిన్‌పల్లి వెజిటబుల్ మార్కెట్ యార్డ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి ఈకో వాహనాన్ని (TG 07 9378) అడ్డుకుని సోదా చేయగా.. అందులో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాల పౌచ్‌లు లభ్యమయ్యాయి. వాహనంలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
*యెరువ బాలశౌరి రెడ్డి అలియాస్ శివారెడ్డి (A1):(32), మేనేజింగ్ డైరెక్టర్, రైతు సంపద సీడ్స్, నివాసం: బండ్లగూడ జాగీర్. (ప్రధాన సూత్రధారి)
2.కపర్తి బెంజిమెన్ (A2): (28), సేల్స్ ఆఫీసర్, నివాసం: మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా.
3.దొంగ శ్రీను (A3): (48), మల్టీ కలర్ ప్రెస్ డిజైనర్, నివాసం: జీడిమెట్ల, హైదరాబాద్.
*ఆర్థిక కష్టాల నుంచి అక్రమ దందా వైపు..
పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు బాలశౌరి రెడ్డి తన వ్యాపారంలో ఎదురైన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఈ అడ్డదారిని ఎంచుకున్నాడు. ఇందుకోసం తన ఉద్యోగి బెంజిమెన్, గ్రాఫిక్ డిజైనర్ దొంగ శ్రీనులతో కలిసి కుట్ర పన్నాడు.
దొంగ శ్రీను సాయంతో నర్మదా సాగర్ కంపెనీని పోలిన డిజైన్‌ను సిద్ధం చేసి, మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లిలోని "ట్రూప్యాక్ ఫ్లెక్సిబుల్స్"లో నకిలీ పౌచ్‌లను ముద్రించారు.
*ప్రధాన నిందితుడికి పాత నేరచరిత్ర
నకిలీ విత్తనాల సరఫరాలో ప్రధాన నిందితుడు బాలశౌరి రెడ్డికి పాత నేరచరిత్ర ఉంది. ఇతనిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి:
*2020: షాద్‌నగర్ పిఎస్ (IPC 420, విత్తనాల చట్టం)
*2020: రాజేంద్రనగర్ పిఎస్ (IPC 420, విత్తనాల నియంత్రణ ఉత్తర్వులు)
*2026: భూత్పూర్ పిఎస్ (BNS 318, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్)
*పోలీసుల హెచ్చరిక: కఠిన చర్యలు తప్పవు!
నకిలీ విత్తనాల విక్రయం యావత్ రైతాంగానికి ముప్పుగా మారిందని మల్కాజ్‌గిరి పోలీసులు హెచ్చరించారు. తక్కువ నాణ్యత గల విత్తనాల వల్ల మొలక శాతం దెబ్బతిని, పంట వైఫల్యాలు చెంది రైతులు ఆర్థికంగా రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ముఠా గుట్టురట్టు చేసిన ఎస్ఓటీ, త్రిమల్గెరి పోలీస్ బృందాలను మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి (IPS) అభినందించారు. ఈ ఆపరేషన్ మల్కాజ్‌గిరి జోన్ డిసిపి చ. శ్రీధర్ (IPS), రోడ్ సేఫ్టీ డిసిపి కె. మనోహర్, ఎస్ఓటీ అడిషనల్ డిసిపి నంద్యాల నరసింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్, త్రిమల్గెరి ఎస్‌హెచ్‌ఓ జి. నాగరాజుల పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది..jpeg)
