జీ.హెచ్.ఎం.సి. నిర్లక్ష్యం.. ప్రజలకు ప్రాణ సంకటం..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- భారీ వర్షాలతో నదులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు.. 
- అక్రమ నిర్మాణాలకు వంతపాడటమే ఈ పరిస్థితికి కారణం.. 
- అధికారులు లంచాల మత్తులో.. అమాయక ప్రజలు వరదల్లో.. 
- నాలాలను మింగేస్తున్న అక్రమ అనకొండలు.. 
- ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టం.. 
- అవినీతి రాజ్యమేలుతున్న రాజకీయ కీచకులు..
- విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగరానికి ఏమిటి ఈ దుస్థితి..? 
- అసలు మనం నగరంలో ఉన్నామా..? నరకకూపంలో ఉన్నామా..? 
- చిన్న వర్షానికే అతలాకుతలం అవుతున్న దౌర్భాగ్యం.. 
- హైడ్రా పనిచేస్తున్నట్లు అనిపిస్తున్నా అనుకున్నంత ఫలితం లేదు.. 
- వ్యర్ధాలను తొలగిస్తే సరిపోదు.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.. 
- సామాన్య ప్రజల మీద ప్రతాపం కాదు.. పెద్ద తలకాయల పనిపట్టాలి.. 
- అక్రమ నిర్మాణాలపై సమర శంఖం పూరిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

download (1)

ఆఫీసు ముగిసింది.. తనబిడ్డ అడిగిన బొమ్మ కొన్నాడు.. భార్యకు మల్లెపూలు, స్వీట్ బాక్స్ కొన్నాడు.. అతను ఒక చిరుద్యోగి.. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు.. కానీ ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది.. క్షణాల్లో ఆకాశం మేఘావృత్తమై పోయింది..  నిమిషాల్లో భారీ వర్షం కమ్ముకుంది.. ఎదో ఆలోచిస్తూ వెళ్తున్న అతని బైక్ వర్షం వరదల్లో చిక్కుకుంది.. నడిరోడ్డుపై తెరచివున్న డ్రైనేజ్ మ్యాన్ హోల్ లో అతని బండి పడిపోయింది..  కూతురుకు కొన్న బొమ్మ, భార్యకు కొన్న మల్లెపూలు నీళ్లలో తేలిపోసాగాయి..  అతని ప్రాణం గాల్లో భారీ వర్షంలో కలిసిపోయాయి.. ఇది ఒక్కరి కథ కాదు.. ఈరోజు హైదరాబాద్ నగరంలో అడుగడుగునా  ఎదురవుతున్న అమాయకుల కథలు, ఎన్నో కుటుంబాల్లో మిగులుతున్న వ్యర్థాలు.. దీనికి కారణం ఏమిటి..? ఒక్క చిన్న వర్షానికే మునిగిపోతున్న నగరం మాటేమిటి..?  ఈ దుస్థితికి కారణం ఎవరు..? నాలాలను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్న అక్రమార్కులు.. వారికి సహకరిస్తున్న  జీ.హెచ్.ఎం.సి. సిబ్బంది.. పట్టించుకోని ప్రభుత్వాలు.. నిమ్మకుండిపోతున్న రక్షణ వ్యవస్థ.. వీటన్నిటి మధ్య అమాయకుల జీవితాలు నలిగిపోతున్నాయి..  పేరుకే విశ్వనగరం.. చూస్తే అంతా డొల్ల.. అవినీతి కంపు.. ఈ పరిస్థితుల్లో మార్పు అనేది సాధ్యం అవుతుందా..? నగర జీవనం సరైన దారికి వస్తుందా..? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలే..   

భారీ వర్షాలు, హైదరాబాద్ లో వరదలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. నాలాలు కబ్జాలు, అధికారుల అవినీతి.. బాధ్యత ఎవరిది? మరోసారి భారీ వర్షాలతో నగరం తడిసి ముద్దయ్యింది. కొద్ది గంటల వానకే రోడ్లన్నీ నదులుగా మారిపోయాయి. పలు ప్రాంతాల్లో అమాయకులైన ప్రజలు తమ ఇళ్లలో బందీల్లా మారిపోయారు. ఈ దృశ్యాలు కొత్తవేమీ కాదు. ప్రతి వర్షాకాలం ఇదే కథ. అసలెప్పుడు మనం జీవించే హక్కును.. సురక్షితమైన నగరంలో ఉంటున్నాం అనే కలను నిజం చేసుకోగలుగుతాం..? 

నాలాల పై కబ్జాలు..  శూన్యంగా మారిన అభివృద్ధి :

హైదరాబాద్ కు జీవనాడులుగా ఉండే నాలాలు ఎన్నో సంవత్సరాలుగా అడ్డదారుల్లో కబ్జాకు గురవుతున్నాయి. వీటిపై అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అధికారుల సహకారంతోనే ఈ భూకబ్జాలు జరుగుతున్నాయన్నది వాస్తవం.. బహిరంగంగా కనిపిస్తున్న నిజం.. తెరవెనుక ఏమేమి జరుగుతున్నాయో..? అందరికీ తెలిసిపోతోంది.. జీ.హెచ్.ఎం.సి.  అధికారులు, స్థానిక నాయకులు కలిసి చేస్తున్న దుర్మార్గం..  నగర అభివృద్ధిని ప్రైవేట్ లాభాల కోసం వీరందరూ తాకట్టు పెట్టారు.

ఒక్క వానకే సిటీ స్థంభించిపోతోంది.. ఎందుకు ఈ దైన్యమైన పరిస్థితి ? :

ఇతర మేట్రో నగరాల్లో గంటల కొద్దీ వాన కురిసినా పెద్దగా ఎలాంటి సమస్యలు ఎదురవ్వడం లేదు.. అక్కడ ప్రజల జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు.. కానీ హైదరాబాద్ లో మాత్రం వరుణుడు కొంచెం సీరియస్ అయినా, ట్రాఫిక్ కష్టాలు, ఇంటింటిలోకి నీరు, ఎక్కడికక్కడ గుంతలు.. వెరసి ఇవన్నీ ప్రజలకు నిత్య నరకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం స్టార్మ్ వాటర్ డ్రైన్స్ వెయింటనెన్స్ లో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం. పాత నాలాలను శుభ్రం చేయకుండా వదిలేయడం, కొత్తగా నిర్మించినవి సరైన ప్రమాణాల ప్రకారం కాకుండా నిర్మించడమే ఇందుకు సిసలైన కారణంగా తెలుస్తోంది.. 

కామెడీ కథలుగా మారిపోతున్న జీ.హెచ్.ఎం.సి. హామీలు : 

ప్రతి సంవత్సరం వర్షాల ముందే జీ.హెచ్.ఎం.సి., వాటర్‌బోర్డ్, రెవెన్యూ శాఖలు కలసి ‘మేము సిద్ధం’ అని పత్రికల ముందుకు వస్తాయి. ఇప్పుడు వీటికి హైడ్రా కూడా తోడయ్యింది.. కానీ నిజానికి సిద్ధంగా ఉండేది కేవలం ప్రజలు వారి అవసరాలు మాత్రమే. అధికారుల మాటలు, వాస్తవరూపంలోకి వచ్చేసరికి తేలిపోతున్నాయి.. కేవలం మాటలవరకే మిగిలిపోతున్నాయి.. ప్రకటనలకిసం లక్షలు, కోట్లు ఖర్చుబెట్టడం, వాటినుంచి కమీషన్లు తీసుకోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.. చివరికి సామాన్యులే బలైపోతున్నారు..  నాణ్యమైన మౌలిక వసతులపై ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ అక్రమార్కులైన అధికారులు, రాజకీయ గడ్డలా జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి.. 

ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అని విశ్లేషకులు చెబుతున్నా.. ప్రజలెప్పుడూ ప్రశ్నిస్తూనే ఉన్నారు.. కానీ వారికి సరైన జవాబు చెప్పే నాథుడు మాత్రం టార్చిలైట్ పెట్టి వెదికినా కనిపించడం లేదు.. ప్రతి సంవత్సరం అదే దారుణ పరిస్థితి, అదే తీరని బాధ, అదే బాధ్యతారాహిత్యం..  చూస్తూ మౌనంగా ఉండలేక.. కొందరు బాధ్యతగా ఈ సమస్యలపై ప్రశ్నిస్తున్నారు.. కొందరు పాత్రికేయులు కూడా తమ కలాలకు పనిచెబుతున్నారు.. కానీ వీరిని ఎవరు పట్టించుకుంటున్నారు.. ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే, ఇంకా ఘాటుగా వార్తలు రాసి వెలుగులోకి తీసుకుని వస్తే..  కేసులు, జైళ్లు, వేధింపులు, బెదిరింపులు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రాణాలు సైతం తీస్తున్నారు.. నాలాలపై కబ్జాలు ఎవరెవరు చేశారో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే అధికారులు స్పందించడం లేదు.. ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయి..  అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరితే.. తిరిగి మనలని ప్రశ్నిస్తున్న దుర్మార్గం అడుగడుగునా నెలకొంది..  క్రిందిస్థాయి ఉద్యోగి నుంచి కమిషనర్ వరకు జీ.హెచ్.ఎం.సి.లో అవినీతిలో కూరుకుని పోయారు.. 

వాస్తవానికి వాళ్ళు గ్రహించాల్సిన నిజం ఒకటి ఉంది .. ఎంత కాదనుకున్నా.. ఎంతగా అక్రమ సంపాదన వెనుకేసుకొస్తున్నా వారు కూడా ఈ నగరంలో ప్రజల్లో భాగమే..  ఎదో ఒకరోజు వారికి, వారి సన్నిహితులకు, వారి కుటుంబసభ్యులకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి..  అప్పుడు వారు ఎవరికీ చెప్పుకుంటారు..? వారు సంపాదించిన అక్రమ ధనం  వారిని కాపాడుతుందా..? ఇది ఆలోచించాలి.. 

కొందరు మేధావులు, విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. ఏమిటంటే ప్రతి నాలా పైన జీ.పీ.ఎస్. మాప్ తో కూడిన డిజిటల్ రికార్డ్ అందుబాటులో ఉంచాలి.. అప్పుడే కబ్జాలు ఆగుతాయి.. కానీ అవినీతికి అలవాటుపడ్డ అధికారులు వున్నంత కాలం ఇది సాధ్యం కాదనే అభిప్రాయలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. చివరగా అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్‌లు కాదు, సురక్షిత జీవనానికి బాటలు వేయడం.. 

హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ప్రాధాన్యతగా మారాలి. నాలాలు, డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్లుతెరిస్తే మంచిది. లేకపోతే ఎప్పుడు వర్షం వచ్చినా ఇవే పరిస్థితులు ఎదురవుతాయి..  వర్షంతో పాటు నగర ప్రజల కన్నీళ్లు కూడా కురుస్తాయి..

 

About The Author