ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన నానుడి వైద్యో నారాయణో హరి..

- ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. 
- ప్రభుత్వ వైద్యానికి రోగం వచ్చింది.. దీనికి చికిత్స ఉందా..?
- దేవాలయాల్లాంటి ప్రభుత్వాసుపత్రులు నరకకూపాలుగా మారిపోయాయి.. 
- గవర్నమెంట్ ఆసుపత్రి అంటేనే జంకుతున్న సామాన్యులు.. 
- ఏ జబ్బుకు ఏ చికిత్స చేస్తారో తెలియని దుర్భర పరిస్థితులు.. 
- పైగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాల హోరు.. 
- ఉచిత వైద్యం అనే పదం కాలగర్భంలో కలిసిపోయింది.. 
- శిథిలావస్థకు చేసుకున్న ఆసుపత్రులు.. పనికిరాని వైద్య పరికరాలు.. 
- కార్పొరేట్ వైద్యానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వ పెద్దలు.. 
- ప్రభుత్వ డాక్టర్లకు లక్షల్లో జీతాలు.. ప్రజలకేమో కుచ్చు టోపీలు.. 
- ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకుంటూ కోట్లు గడిస్తున్న ప్రభుత్వ వైద్యులు.. 
- వైద్యారోగ్య శాఖ అసలు పని చేస్తోందా..? అన్నది అనుమానమే.. 
- అక్రమ నియామకాలు, అక్రమ బదిలీలు ఈ శాఖను నిర్వీర్యం చేస్తున్నాయి.. 
- అధికారులు, ప్రభుత్వ పెద్దలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.. 
- అనారోగ్యం పాలైన ప్రభుత్వ వైద్యంపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. 

WhatsApp Image 2025-12-29 at 4.56.06 PM

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

వైద్యం ఒక మహత్తర కార్యక్రమం.. వైద్యులు భగవంతుడితో సమానం.. వైద్యశాఖ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శాఖ.. ఆ బ్రహ్మ ప్రాణం పోసి జన్మను ఇస్తే..  వైద్యులు మరు జన్మను ఇస్తారు.. వైద్యో నారాయణో హరి అనే నానుడి ఇప్పుడు బూజుపట్టిపోయింది.. ప్రభుత్వ వైద్యానికి గ్రహణం పట్టింది.. చికిత్సకు వీలుకాని రోగం చుట్టుకుంది.. అవినీతి, లంచగొండితనం అనే వైరస్ వైద్య శాఖకు అంటుకుంది..  దీంతో ప్రజారోగ్యం అటకెక్కేసింది.. సామాన్య, పేద ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది.. ఈ వరస మారాలని పోరాటం చేస్తోంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్  హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యం, తెలంగాణాలో నేడు తానే చికిత్స కోరే స్థితికి చేరింది. ఆసుపత్రులు దేవాలయాలై ఉండాల్సిన చోట, నిర్లక్ష్యం, అవినీతి, అవ్యవస్థల కట్టడిలేని గోదాములుగా మారుతున్న దృశ్యం మన కళ్లముందే కదులుతోంది.. 

దేవుడితో సమానం అన్న వైద్యుడు… విలువలు కోల్పోతున్న దుర్భర పరిస్థితి ఇప్పుడు రాజ్యం ఏలుతోంది.. ఒకప్పుడు ప్రభుత్వ వైద్యుడు అంటే పేదల పాలిట దేవుడు. ఉచిత వైద్యం, నిజాయితీ సేవ, మానవత్వం.. ఇవే ప్రభుత్వ ఆసుపత్రుల గుర్తింపు. కానీ నేడు అదే వ్యవస్థలో వైద్యుల కొరత, నర్సులపై అధిక భారం, పరికరాల లేమి, మందుల కొరత, మౌలిక వసతులు శిథిలావస్థకు చేరుకున్నాయి.. దీంతో వైద్యో నారాయణో హరి అన్న మాటను వ్యంగ్యంగా మారుస్తున్నాయి.

భవనాలు ఉన్నాయ్… వైద్యం లేదు.. తెలంగాణలో కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు ఉన్నా ఐ సి యూలు పనిచేయవు..  స్కానింగ్ మెషీన్లు మూలకు పడేశారు.. ల్యాబ్ రిపోర్ట్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అగత్యం ఏర్పడింది..  రిఫరల్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నారు.. 


ఇది అభివృద్ధి కాదు… ప్రజల ప్రాణాలతో ఆట : 

పథకాలు పోస్టర్లలో… బాధలు వార్డుల్లో మిగిలిపోతున్నాయి.. ప్రభుత్వం గొప్పగా ప్రకటించే ఆరోగ్య పథకాలు కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి..  ఆరోగ్యశ్రీ కార్డుతోనూ బయట ఖర్చులు తప్పడం లేదు.. 
ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ దొరకక ప్రైవేట్ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది.. పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి.. 


ఇదేనా సంక్షేమ రాజ్యం? :

ఇది పూర్తిగా వైద్యుల తప్పు అని చెప్పలేము.. అసలు వ్యవస్థకే పెద్ద రోగం వచ్చింది.. ఇక్కడ బాధ్యత అంతా వైద్యులపై వేయడం కూడా అన్యాయం. ఒక డాక్టర్‌పై వందల మంది రోగులు ఆధారపడుతున్నారు..  24 గంటల డ్యూటీలు, వారికి సరైన భద్రత లేకపోవడం, రాజకీయ జోక్యం, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, ఇవన్నీ కలసి వైద్యుడినే ఒక బాధితుడిగా మార్చుతున్నాయి.

ప్రాణాల విలువ శూన్యం? :

ఆక్సిజన్ లేక పెరుగుతున్న మృతులు.. ప్రసవ సమయంలో తల్లి, శిశు మరణాలు, ఎమర్జెన్సీలో అంబులెన్స్ ఆలస్యం కావడం.. 
ఇవి వార్తలుగా మాత్రమే మిగులుతున్నాయి. మరి దీనికి బాధ్యులెవరు? జవాబుదారీతనం ఎక్కడ? ఇకనైనా ప్రభుత్వం మేల్కొనకపోతే… ప్రజలే మేల్కొంటారు.. నిజానికి వైద్యం వ్యాపారం కాదు అది మౌలిక హక్కు. ప్రభుత్వం ఇప్పటికైనా వైద్య నియామకాలు పూర్తి చేయాలి.. 
ఆసుపత్రులకు నిధులు నిజంగా చేరేలా చూడాలి.. అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి..  లేకపోతే “వైద్యో నారాయణో హరి” అన్న మాట చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోయే నానుడిగా మారిపోతుంది. ప్రజల ప్రాణాలే లక్ష్యమా? లేదా గణాంకాలు, ప్రచారమే ప్రభుత్వ వైద్యానికి పరమార్థమా? ఒక్కసారి ఆలోచించాలి..

About The Author