ఐఐటీ హైదరాబాద్ బీటెక్–2026 ప్లేస్‌మెంట్స్: ఫేజ్–1లో 62.42 శాతం విజయం
- సగటు సీటీసీ ₹30 లక్షలు దాటింపు… సర్క్యూటల్ విభాగాల్లో 83 శాతం పైగా ప్లేస్‌మెంట్
సంగారెడ్డి :
ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్–2026 ప్లేస్‌మెంట్ సీజన్ ఫేజ్–1 బలమైన ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 487 మంది నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 304 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంతో ప్లేస్‌మెంట్ రేటు 62.42 శాతంగా నమోదైంది.
ఈ సీజన్‌లో సగటు సీటీసీ ₹30 లక్షల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అన్ని విభాగాల్లో సగటు మరియు మధ్యస్థ (మీడియన్) పారితోషికాల్లో స్థిరమైన పెరుగుదల కనిపించిందని సంస్థ అధికారులు వెల్లడించారు. పోటీ నియామక పరిస్థితుల్లోనూ రిక్రూటర్‌ల విశ్వాసం కొనసాగుతున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
సర్క్యూటల్ విభాగాల్లో అత్యుత్తమ ప్లేస్‌మెంట్ ఫలితాలు నమోదయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం 83.33 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 83.05 శాతం, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 77.78 శాతం ప్లేస్‌మెంట్ రేటును సాధించాయి. ఈ విభాగాల్లో సగటు సీటీసీ ప్యాకేజీలు ₹40 లక్షల పరిధిలో ఉన్నాయి.
మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి కోర్ ఇంజనీరింగ్ శాఖలు కూడా స్థిరమైన ప్లేస్‌మెంట్ ఫలితాలు సాధించాయి. సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు కోర్ డొమైన్ ఉద్యోగాల్లోనూ సమతుల్య పనితీరు కనిపించిందని అధికారులు తెలిపారు.ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో గరిష్ట అంతర్జాతీయ పారితోషికం సంవత్సరానికి ₹2.5 కోట్లకు చేరుకుంది. దేశీయంగా ఇద్దరు విద్యార్థులు ₹1.1 కోట్ల ప్యాకేజీలు పొందగా, మరో నలుగురు విద్యార్థులు ₹75 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఆఫర్‌లు సాధించారు. మొత్తం మీద విభాగాల వారీగా 24 అంతర్జాతీయ ఆఫర్‌లు లభించాయి.
ఫేజ్–2 నియామక ప్రక్రియ జనవరి 5, 2026 నుంచి ప్రారంభమైంది. మిగిలిన ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించగా, కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ఇదే సమయంలో, బీటెక్–2027 ఇంటర్న్‌షిప్ సీజన్ కూడా మంచి ఆరంభం పొందింది. ఇప్పటివరకు 279 ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లు, 15 అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లు లభించగా, నెలకు ₹7.5 లక్షల వరకు స్టైపెండ్‌లు ఆఫర్ కావడం గమనార్హం.
