డిజిటల్ ఆరోగ్య సంరక్షణకు 'ఆభా' కీలకం..
వైదేహి నగర్‌లో కార్డుల నమోదు కార్యక్రమంలోపాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
బి.ఎన్.రెడ్డి నగర్:
ప్రజల ఆరోగ్య వివరాలను సాంకేతిక రూపంలో భద్రపరచుకోవడానికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ABHA) కార్డులు ఎంతో దోహదపడతాయని బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైదేహి నగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన 'ఆభా' కార్డుల నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రికార్డుల తిప్పలు తప్పవు..
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లే సమయంలో పాత వైద్య పత్రాలు, రిపోర్టులు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదని తెలిపారు. ఆభా ఖాతా ద్వారా వైద్యులు నేరుగా రోగి యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను పరిశీలించే వీలుంటుందని వివరించారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, అత్యవసర సమయాల్లో త్వరితగతిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.
బీమా పథకాలకు అనుసంధానం
ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలకు కూడా ఈ కార్డు అనుసంధానమై ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనికతో పాటు కాలనీ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, కోటేశ్, హిమవంత్ రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
