విద్యార్థులు మహావృక్షాల్లా ఎదగాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

  • - విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు
  • - ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి
  • - లోక్ భవన్ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ

విద్యార్థులు మహావృక్షాల్లా ఎదగాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్:

 ప్రతి విద్యార్థి ఒక చిన్న మొక్కలాంటివాడని, దానిని ప్రేమతో సంరక్షిస్తే మహావృక్షంగా ఎదిగినట్లే విద్యార్థులను కూడా విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో తీర్చిదిద్దితే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని, తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొని కుటుంబానికి, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని గవర్నర్ విద్యార్థులకు సూచించారు.


భారత్ సేవాశ్రమ సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం లోక్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, కొద్దిసేపటి క్రితం లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక మొక్కను నాటినట్లు తెలిపారు. ఆ మొక్కకు ప్రతిరోజూ నీరు పోసి, బయటి ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తే అది మహావృక్షంగా మారుతుందని, అదే విధంగా విద్యార్థులను కూడా మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉంచి నాణ్యమైన విద్యతో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.

లోక్ భవన్ పాఠశాల కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదని, సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లోక్ భవన్ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

భారత్ సేవాశ్రమ సంఘ్ సేవ, కరుణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్ కొనియాడారు. “మానవ సేవయే మాధవ సేవ” అనే సంఘ్ ఆదర్శం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. విపత్తు సహాయం, ఆరోగ్య సేవలు, విద్యారంగాల్లో సంఘ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఇటీవల ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన  ‘యంగ్ ఇండియా’ విద్యార్థి కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం, సంకల్పం కనిపించిందన్నారు. అదే వేదికపై విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. లోక్ భవన్ పాఠశాల విద్యార్థులు కూడా తమ శక్తిని విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లించాలని సూచించారు.
తెలంగాణను దేశంలోనే విద్య, క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ తెలిపారు. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ వంటి కార్యక్రమాలు ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని అన్నారు.
నేడు పంపిణీ చేస్తున్న నోట్‌బుక్‌లు కేవలం కాగితాల కట్టలు కాదని, విద్యార్థుల కలలు, ఆత్మవిశ్వాసం, ఉజ్వల భవిష్యత్తుకు పునాదులని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ, లోక్ భవన్ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేస్తూ స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న భారత్ సేవాశ్రమ సంఘ్‌ను గవర్నర్ అభినందించారు.WhatsApp Image 2026-06-24 at 17.46.30

వైభవ్ సూర్యవంశీని స్ఫూర్తిగా తీసుకోండి

కేవలం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో తన ప్రతిభను చాటుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ సూచించారు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం సాధించడం ద్వారా కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించాడన్నారు. “పెద్ద కలలు కనండి... వాటిని సాధించేందుకు నిరంతరం శ్రమించండి. విజయం మీ వెంట వస్తుంది” అని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, లక్ష్యసాధనకు వైభవ్ సూర్యవంశీ ప్రయాణం నేటి విద్యార్థులు,యువత కు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, భారత్ సేవాశ్రమ సంఘ్ స్వామి మున్నేశ్వరానంద, స్వామి వెంకటేశ్వరానందజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించిన గవర్నర్

అంతకుముందు గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. నోటు పుస్తకాలు అందజేశారు.

About The Author