ట్రై కార్పొరేషన్ల పరిధిలో వైభవంగా ఆషాఢ బోనాలు
- లండన్ నుండి ‘జూమ్’ దృశ్య మాధ్యమ సమీక్షలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ.
- *ఉత్సవాలకు రూ. 20 కోట్లు కేటాయింపు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
- *మహిళల భక్తి, తెలంగాణ ఆత్మకు ప్రతీక మన బోనాల పండుగ
- * ఉత్సవాల కాలపరిమితి: జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు
- * తొలి బోనం: జూలై 16న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభం
- * ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సుల నేపథ్యంలో రవాణా శాఖకు ప్రత్యేక ఆదేశాలు
హైదరాబాద్:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద వారసత్వానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు. గతంలో కేవలం ఒకే కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఈ ఉత్సవాలను, ఈసారి మరింత విస్తృతంగా, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి, బుధవారం అక్కడి నుంచే దృశ్య మాధ్యమ సమావేశం (జూమ్ యాప్) ద్వారా హైదరాబాద్‌లోని ‘మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ’ (మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ) లో జరిగిన బోనాల ఉత్సవాల ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, శాసనమండలి సభ్యులు బొగ్గారపు దయానంద్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, దానం నాగేందర్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. సజ్జనార్, ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద హరి మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*జూలై 16న గోల్కొండలో తొలి బోనం
ఈ ఏడాది ఆషాఢ జాతర ఉత్సవాలు జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో జరగనున్నాయని మంత్రి ప్రకటించారు. జూలై 16న చారిత్రాత్మక గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో ప్రారంభమయ్యే ఉత్సవాలు, ఆగస్టు 13న సాగనంపు కార్యక్రమంతో అట్టహాసంగా ముగుస్తాయన్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం (భవిష్యవాణి), గావుపట్టడం వంటి సాంప్రదాయ ఘట్టాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయని, ఈ సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు..jpeg)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దేవాదాయ శాఖపై, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి కొనియాడారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల ఘనమైన నిర్వహణ కోసం రూ. 20 కోట్ల నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులను ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, క్యూలైన్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ మరియు పుష్పాలంకరణలు, నిఘా కెమెరాల (సీసీ కెమెరాలు) ఏర్పాటు మరియు వైద్య శిబిరాల కోసం సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
*‘మహాలక్ష్మి’ ప్రభావం.. రవాణా, భద్రతపై ప్రత్యేక నిఘా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఈసారి రాష్ట్రం నలుమూలల నుండి మహిళా భక్తులు, ప్రజలు హైదరాబాద్ నగరానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రవాణాకు ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులు, ప్రత్యేక రవాణా ప్రణాళికలు సిద్ధం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. అదేవిధంగా, భారీ రద్దీ ఉండే ఆలయాల వద్ద నగర పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
భక్తుల సౌకర్యార్థం దేవాదాయ, నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), పోలీస్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జలమండలి, ఆర్టీసీ, మెట్రో రైల్, వైద్య-ఆరోగ్య, అగ్నిమాపక, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, గర్భిణులు మరియు బాలింతల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాల్లో ప్రత్యేకంగా ‘స్తన్యపాన గదులను’ (లాక్టేషన్ రూమ్స్) ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన బోనాల పండుగను ప్రపంచస్థాయిలో నిలిపేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

