ధరణి నుండి భూ భారతి దాకా లోపాల పుట్టే..!
- సాంకేతికత ఉన్నా తప్పని అవకతవకలు*
- రాయదుర్గంలో ఎకరం రూ. 237 కోట్లు: రియల్ ఎస్టేట్ మాయాజాలంలో నలిగిపోతున్న భూమిపుత్రులు
- నకిలీల అడ్డాగా మారిన ఐటీ హబ్: ఐటీ కారిడార్‌లో వివాదాల సుడిగుండం
పాలకులు మారినా, రంగులు మార్చినా ప్రభుత్వాల 'భూ'ప్రహసనం మరియు దందా మాత్రం మారడం లేదు! నిన్న ‘ధరణి’ అని ఊదరగొట్టారు, నేడు ‘భూ భారతి’ అంటూ సరికొత్త డిజిటల్ పల్లవి అందుకున్నారు, తీరా చూస్తే పారదర్శకత ఎక్కడయ్యా అంటే సమాధానమే లేదు. సాంకేతికతతో అద్భుతాలు చేస్తామంటూ, శాఖల మధ్య కనీస సమన్వయం లేక తప్పుల తడకల రికార్డులతో సరికొత్త లోపాలను తెరపైకి తెస్తున్నారు. ఒకవైపు రాయదుర్గంలో ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు పలుకుతూ రియల్ ఎస్టేట్ మాయాజాలం సృష్టిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో భూమిపుత్రుల ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోతోంది. ఒక సాదాసీదా వేలం కాస్తా అంతర్జాతీయ పెట్టుబడులకు విఘాతం కలిగిస్తూ, చట్టపరమైన సంక్లిష్ట వివాదంగా మారి నేడు ప్రభుత్వానికి పెను సవాల్‌గా నిలిచింది. ఇది ముమ్మాటికీ మన పాలకుల అస్తవ్యస్త 'భూ'పాలన మహత్యం!
*హైదరాబాద్:
రాష్ట్రంలో భూ వ్యవహారాలు ప్రభుత్వాలకు పెను సవాల్‌గా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు, పాలకులు మారుతున్నా భూ దందాలు, అక్రమాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలు, ప్రస్తుత ప్రజాపాలనలోనూ కొనసాగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
భూ రికార్డులను ప్రక్షాళన చేసి, పారదర్శకత తీసుకువస్తామంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో తీవ్ర లోపాలతో విఫలమైంది. మధ్యవర్తుల లీలలు, అధికారుల విచక్షణారహిత నిర్ణయాల వల్ల సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం ‘భూ భారతి’ పేరుతో కొత్త వ్యవస్థను తెచ్చినా, భూ సర్వేలు చేస్తున్నామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. ఇటీవల జరిగిన ఎస్బీఐ భూ వ్యవహారమే దీనికి నిదర్శనం. డిజిటల్ యుగంలో కూడా టిజిఐఐసి (TGIIC), రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
*మూడు దశాబ్దాల దక్కన్ దోపిడీ.. కుప్పకూలిన 'భూమిపుత్రుల' ఆర్థిక వ్యవస్థ!
గడిచిన ముప్పై ఏళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని భూముల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాటి సమైక్య పాలకుల వ్యూహాత్మక మార్పుల వల్ల రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, గచ్చిబౌలి, కోకాపేట్, నెన్‌నాంపూర్, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలు ఐటీ, పారిశ్రామిక హబ్‌లుగా అవతరించాయి.
అయితే, ఈ భూ అద్భుతం వెనుక స్థానిక భూమిపుత్రుల కన్నీళ్లు దాగి ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా బతికిన రైతుల భూములను ఆదాయ వనరుగా మార్చుకుని, కార్పొరేట్ శక్తులు పడగలెత్తాయి. ఇటీవల రాయదుర్గంలో ఒక ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్లు పలికిందంటే ఇక్కడి భూముల మాయాజాలం మరియు రియల్ ఎస్టేట్ మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొదట్లో ఒక సాధారణ ప్రభుత్వ భూ వేలం లాగా ప్రారంభమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వ్యవహారం, ఇప్పుడు హక్కులు, సంస్థాగత అధికారాలు మరియు చట్టపరమైన చిక్కులతో అత్యంత సంక్లిష్టమైన వివాదంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 నగరాల నుండి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తున్న తరుణంలో.. హెచ్-1బీ (H-1B) వీసా ఆంక్షలు, గల్ఫ్ యుద్ధ నేపథ్యం కారణంగా పెట్టుబడుదారులలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
*‘భారత శక్తి’ డిమాండ్: ప్రభుత్వానికి పెను సవాల్!
భూ వ్యవహారాలు అనేవి కేవలం కొన్ని సర్వే నంబర్లకు సంబంధించినవి కావు. అవి పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక, మరియు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన సవాల్. ఇప్పటికైనా ప్రభుత్వం శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, సాంకేతికతలోని లోపాలను సరిదిద్ది, నిజమైన పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
.jpeg)
