గోదావరిని దోచేస్తున్న బడా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ
మణుగూరు:
గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారాన్ని అడ్డగోలుగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక బడా కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ ఆరోపించారు. శుక్రవారం రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో ముఖ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా సదరు కాంట్రాక్టర్ సొసైటీ సభ్యుల పేర్లతో టెండర్లు వేయించి, ఆ టెండర్ల ముసుగులో తనే పూర్తిగా ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నాడని పూనెం సరోజ తెలిపారు. సభ్యులకు “గుడ్‌విల్” పేరుతో కొద్దిపాటి సొమ్ము ఇచ్చి, మిగతా కోట్ల రూపాయల ఆదాయాన్ని తన జేబులో వేసుకుంటున్నాడని ఆరోపించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ పన్నును ఎగవేసి కోట్ల రూపాయల నష్టం కలిగించాడని, ఇది రాష్ట్ర ఖజానాకు తీవ్రమైన దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. సొంత లారీలు కలిగి ఉండడంతో బయట వ్యక్తుల పేర్లతో దొంగ వే బిల్లులు సృష్టించి, ఆ లారీల ద్వారానే హైదరాబాద్ నగరానికి ఇసుక తరలిస్తూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నాడని వివరించారు. ఈ దందాపై సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని పూనెం సరోజ డిమాండ్ చేశారు. నిజాలు బయటపడితే ఈ అక్రమాల వెనుక ఉన్న పెద్దలందరి పేర్లు వెలుగులోకి వస్తాయన్నారు. పేద ప్రజల సహజ సంపద అయిన గోదావరి ఇసుకను దోచుకుంటున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రేణుక అక్షర మహిళా మండలి సభ్యులుతో కలిసి ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి, గత ఐదేళ్ల లావాదేవీలను ఆడిట్ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి ఎవరి సొంత ఆస్తి కాదు ప్రజల సంపద అని పేర్కొంటూ, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు కోరి శ్యామల, కన్నాపురం వసంత, డేరంగుల సుజత, రెడ్డిబోయిన రేణుక, కన్నాపురం శైలజ, సౌజన్య డాకూరి తదితరులు పాల్గొన్నారు.
