రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: కలెక్టర్ కుమార్ దీపక్
- కొనుగోలు కేంద్రాల పరిశీలన
మంచిర్యాల:
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట, నమ్నూర్ లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎస్.ఆర్.ఎం., గాయత్రి రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. హమాలీల సమస్యను అధిగమించేందుకు స్థానికంగా హమాలీలను తీసుకొని ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్ లలో హమాలీలతో కలిపి 2 గోదాములను ఇచ్చారని, అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం నిల్వ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈసారి ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లను సైతం వినియోగించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అనంతరం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జై యోగేశ్వర రైస్ మిల్ ను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించి ధాన్యం దిగుమతి, సి.ఎం.ఆర్. ప్రక్రియను పరిశీలించారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని, నిర్దేశిత సి.ఎం.ఆర్. లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
