ఓటరు జాబితా సవరణకు అఖిలపక్షం ఏకం!

  • జూన్ 15 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) షెడ్యూల్
  • *సర్వేకు సహకరించాలని డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పిలుపు
  • *ప్రజాస్వామ్య బలోపేతానికి రాజకీయ పార్టీలు నడుం బిగించాలి

ఓటరు జాబితా సవరణకు అఖిలపక్షం ఏకం!

బడంగ్‌పేట్:

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని బడంగ్‌పేట్ సర్కిల్-16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య కోరారు. జూన్ 15 నుండి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సర్కిల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక వివిధ పార్టీల నాయకులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

*అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల సవరణ అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి పౌరుడి పేరును ఓటరు జాబితాలో చేర్చడం, తప్పులను సరిదిద్దడం, చిరునామాల మార్పులు, చేర్పులను గడువులోగా పూర్తి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నా, పేర్లలో దొర్లిన తప్పులను సరిచేసుకోవడానికి ఇది మంచి అవకాశమని తెలిపారు.

"ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరం. ఇందులో ప్రతి పౌరుడు, రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలి."
  వి. సమ్మయ్య, డిప్యూటీ    కమిషనర్

*ప్రచారంలో పార్టీల పాత్ర కీలకం
క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ ప్రత్యేక సవరణపై అవగాహన కల్పించడంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంతో కీలకమని డిప్యూటీ కమిషనర్ అభిప్రాయపడ్డారు. తమ తమ పరిధిలోని డివిజన్లు, వార్డుల్లో ప్రజలను చైతన్యపరిచి, సర్వే కోసం వచ్చే క్షేత్రస్థాయి సిబ్బందికి (బీఎల్ఓలు) పూర్తి సహకారం అందించేలా చూడాలని కోరారు. ప్రజలు కూడా తమ వివరాలను సక్రమంగా అందించి, ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలన్నారు.

*సహకరిస్తాం: అఖిలపక్ష నాయకులు
సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే సజావుగా సాగేందుకు, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.WhatsApp Image 2026-05-22 at 18.14.20 (1)

About The Author