పాలమూరు ప్రాజెక్టులపై సీఎం పర్యటన అంతా డ్రామా!

  • * పదేళ్ల ‘బీఆర్‌ఎస్’ వంచన.. రెండేళ్ల ‘కాంగ్రెస్’ నిర్లక్ష్యం
  • * వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి టూర్
  • *ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి నిప్పులు!

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం పర్యటన అంతా డ్రామా!

మహేశ్వరం:

ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు రహిత ప్రాంతంగా మారుస్తామంటూ కాలయాపన చేస్తూ, ప్రాజెక్టుల పేరుతో రాజకీయ లబ్ధి పొందుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరిపై రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాలమూరు ప్రాజెక్టుల సందర్శన కేవలం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్ప, జిల్లాపై ఉన్న ప్రేమతో కాదని ఆయన స్పష్టం చేశారు.

*కమీషన్ల కోసమే రీ-డిజైనింగ్: పదేళ్ల బీఆర్‌ఎస్ వంచన!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పునఃరూపకల్పన (రీ-డిజైనింగ్) పేరుతో తొక్కిపెట్టి తీవ్ర వంచనకు ఒడిగట్టిందని పాండురంగా రెడ్డి ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టు అంచనాలను పెంచారే తప్ప, క్షేత్రస్థాయిలో పనులను పూర్తి చేయలేదని ఆరోపించారు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్) వంటి కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచారని మండిపడ్డారు. పాలమూరు గుండె నిండా నీళ్లు నింపుతామని చెప్పి, పదేళ్ల పాటు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని జిల్లాను వలసల బాటనే ఉంచారని విమర్శించారు.

*రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఘోర నిర్లక్ష్యం!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గానీ, కేంద్రం నుండి పర్యావరణ, అటవీ అనుమతులు గానీ సాధించడంలో పూర్తిగా విఫలమైందని పాండురంగా రెడ్డి దుయ్యబట్టారు. బడ్జెట్‌లో ప్రాజెక్టులకు సరైన నిధులు కేటాయించలేదని, భూసేకరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల సమగ్ర నివేదికల (డీపీఆర్) రూపకల్పనలో, సాంకేతిక లోపాలను సవరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.

*ఏసీ రూముల సమీక్షలకే పరిమితం!
 "మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, శ్రీహరి ఇప్పటివరకు కేవలం కాగితాల మీద, ఏసీ రూముల్లో సమీక్షలు నిర్వహించారే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అధికారంలోకి వస్తే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని నిరుద్యోగులను, రైతులను నమ్మించిన సీఎం, ఇప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలను ముందు పంపి హడావుడి చేయడం హాస్యాస్పదం."
    కప్పాటి పాండురంగా రెడ్డి,

*ప్రజా ఆగ్రహం తప్పదు!
ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ డ్రామాలను పక్కనబెట్టి... తక్షణమే పాలమూరు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, భూసేకరణ పూర్తి చేయాలని, పెండింగ్ అనుమతులను సాధించాలని పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు, రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

About The Author