ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు పక్కా ప్రణాళిక.
- అర్హులందరికీ ఓటు హక్కు.. అనర్హుల తొలగింపునకు ఈసీ కసరత్తు.
- *క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అదే సమయంలో జాబితాలో ఉన్న అనర్హులైన ఓటర్ల పేర్లను పూర్తిగా తొలగించేలా పక్కా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవనంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి (పూర్తి అదనపు బాధ్యతలు) జి.ఎస్. చారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ (హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి) ఆర్.వి. కర్ణన్, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) ఎం. మను చౌదరితో పాటు సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్ఓలు) పాల్గొన్నారు.
*బీఎల్ఓల పనితీరుపై నిరంతర నిఘా
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సజావుగా సాగడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారని సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
బీఎల్ఓలకు సవరణ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా ఈఆర్ఓలు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.
*పనితీరు సమీక్ష:
క్షేత్రస్థాయిలో బీఎల్ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో చురుగ్గా పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రోత్సహించేందుకు ‘బెస్ట్ బీఎల్ఓ’ అవార్డులను అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
*గేటెడ్ కమ్యూనిటీలు, మురికివాడలపై ప్రత్యేక నజర్
పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈసారి ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది.
*పట్టణ ఓటర్లపై ఫోకస్:
ఎత్తైన అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అక్కడి నివాసితులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై, సవరణ ప్రక్రియపై ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా నగరాల్లోని మురికివాడల్లో నివసించే ప్రజలకు సైతం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఈఓ ఆదేశించారు.
*తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఫారాలు
ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ల గణన (ఎన్యూమరేషన్) ఫారాలు ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు సమాజంలో ఉన్న ప్రముఖులు (వీఐపీ, వీవీఐపీ) ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సక్రమంగా జరిగేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
