నిబంధనలు బేఖాతరు.. అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ ..!

  • ల్బీనగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ విభాగంలో జోరుగా అక్రమాలు.
  • *అనుమతులు లేకుండానే వెలుస్తున్న బహుళ అంతస్తులు, వాణిజ్య సముదాయాలు
  • *ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి.
  • ఎల్బీనగర్ జోన్ ఎస్టిఎఫ్ ఇంచార్జ్ సి.పి, జోనల్ కమిషనర్ దృష్టి సారించకపోతే అంతే సంగతులు..!

నిబంధనలు బేఖాతరు.. అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ ..!

ఎల్బీనగర్:

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని ఎల్బీనగర్ జోన్, ఎల్బీనగర్ సర్కిల్ 13 అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణా లోపం, కొందరు సిబ్బంది అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు వెలుస్తున్నాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న భవనాలపై స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నా.. మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.WhatsApp Image 2026-05-26 at 20.00.07 (1)

*నిషేధిత జాబితా నుండి మారినా.. పాత పద్ధతిలోనే అక్రమాలు!
సాగర్ కాంప్లెక్స్ పరిధిలోని భూములు గతంలో నిషేధిత జాబితాలో ఉండటం వల్ల ఎలాంటి నిర్మాణ అనుమతులకు అవకాశం లేకుండేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో ఈ భూములకు విముక్తి లభించింది. వీటిని నిషేధిత జాబితా నుండి తొలగించినప్పటికీ, ఇక్కడి భూస్వాములు, బిల్డర్లు మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పాత పద్ధతిలోనే అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా, అనుమతి పత్రాలు లేకుండానే యథేచ్ఛగా నిర్మాణ పనులు సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

*డివిజన్ల వారీగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు:
సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కొన్ని ప్రధాన ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి:
 *హస్తినాపురం డివిజన్: శ్రీపురం కాలనీ రోడ్ నంబర్ 4 లోని కృష్ణవేణి కళాశాల వెనుక భాగంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రేకుల షెడ్ల నిర్మాణం చేపట్టారు.
 * *గ్రీన్ పార్క్ కాలనీ:* కాలనీలోని రోడ్ నంబర్ 1, ప్లాట్ నంబర్ ఏ-33 లో నివాస స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య (కమర్షియల్) నిర్మాణాన్ని సాగిస్తున్నారు.
 * *కర్మన్‌ఘాట్:* మైత్రీపురం ప్లాట్ నంబర్ 111 లో మున్సిపల్ అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.WhatsApp Image 2026-05-26 at 20.00.06 (1)

ఫిర్యాదులు బుట్టదాఖలు.. అధికారుల సమాధానాలు విచిత్రం!
ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజలు ఎల్బీనగర్ సర్కిల్ 13 కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిని టిపిఎస్ అర్చన కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన సిబ్బంది, అక్రమ నిర్మాణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారిని ఏసీపీ ప్రతాప్ ని వివరణ కోరగా.. కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోందని, పనిభారం ఎక్కువ కావడం వల్లే పర్యవేక్షణ కష్టమవుతోందంటూ సమాధానం దాటవేయడం గమనార్హం.

ఇంచార్జ్ పాలన.. అధికారులకు ఆడిందే ఆట!
ఎల్బీనగర్ సర్కిల్ 13 లో గత కొన్ని నెలలుగా శాశ్వత డిప్యూటీ కమిషనర్ (డీసీ) లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రస్తుతం ఇంచార్జ్ డిప్యూటీ కమిషనర్ విధులు నిర్వహిస్తుండటంతో, టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు 'ఆడిందే ఆట.. పాడిందే పాట'గా మారింది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల నియంత్రణ కరువవ్వడంతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.WhatsApp Image 2026-05-26 at 20.00.06

*ఉన్నతాధికారులు స్పందించాలి..
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ (సీపీ), ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ఇంచార్జ్ తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సర్కిల్ 13 పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

About The Author