పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ‘పోష్’ కవచం
- * లైంగిక వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
- * ప్రతి సంస్థలో ‘అంతర్గత కమిటీ’ ఏర్పాటు తప్పనిసరి
- *రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి
రంగారెడ్డి:
పని ప్రదేశాల్లో మహిళలకు పూర్తి రక్షణ, భద్రత కల్పించడమే ‘పోష్’ (POSH - లైంగిక వేధింపుల నిరోధక) చట్టం ముఖ్య ఉద్దేశమని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. ప్రభుత్వ ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ఉత్సవాల్లో భాగంగా, మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యతన్నారు. విధుల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా మహిళలు ఈ చట్టం ద్వారా న్యాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు.
*విశాఖ కేసు నేపథ్యం.. ఐసీ కమిటీల ఏర్పాటు!
సదస్సులో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పద్మావతి మాట్లాడుతూ.. చారిత్రాత్మక ‘విశాఖ వర్సెస్ రాజస్థాన్’ కేసు నేపథ్యం, ఆ తర్వాత పోష్ చట్టం రావడానికి గల కారణాలను వివరించారు. అనంతరం లోక్ అదాలత్ శాశ్వత సభ్యురాలు అమితా రాణి మాట్లాడుతూ.. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలలో లైంగిక వేధింపులు ఎదురైతే మహిళలు అధైర్యపడకుండా తక్షణమే అంతర్గత కమిటీ (ఇంటర్నల్ కమిటీ - ఐసీ)కి ఫిర్యాదు చేయాలని సూచించారు. మరో వక్త డాక్టర్ సిరి ప్రీతి మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో అంతర్గత కమిటీ ఏర్పాటు చేయడం చట్టరీత్యా తప్పనిసరని స్పష్టం చేశారు. యజమానులు, ఉన్నతాధికారులు లేదా తోటి ఉద్యోగుల వల్ల వేధింపులు ఎదురైతే ఎలా ఫిర్యాదు చేయాలో వివరించారు. అంతర్గత కమిటీలు లేని చోట ‘స్థానిక కమిటీల’ (లోకల్ కమిటీ) ప్రాధాన్యతను గుర్తుచేశారు.
హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యాదగిరి స్పందిస్తూ.. పోష్ చట్టంలోని న్యాయపరమైన అంశాలను, కోర్టుల్లో పరిష్కారమైన పలు కేసులను ఉదాహరణలుగా చూపుతూ వివరించారు. మహిళలు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శారదా దేవి, జిల్లా వ్యవసాయ అధికారి, డీపీఓ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వయోజన విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.jpeg)
