పల్లె పల్లెకూ ‘డిజిటల్’ వెలుగులు!
- తెలంగాణలో ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టుకు సరికొత్త రూపం
- *కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కీలక భేటీ.
- *రూ. కోట్లతో సవరించిన ‘భారత్‌నెట్’ కార్యాచరణ.. త్వరలోనే ఒప్పందం
- *‘రింగ్ ఆర్కిటెక్చర్’తో అంతరాయం లేని హైస్పీడ్ ఇంటర్నెట్
- *తొలి విడతగా మూడు ఉమ్మడి జిల్లాల్లోని 3,089 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం
హైదరాబాద్:
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తూ, పల్లె పల్లెకూ నిరంతరాయంగా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడికి సైతం చేరువ చేయడమే లక్ష్యంగా ‘టీ-ఫైబర్’ (తెలంగాణ ఫైబర్ గ్రిడ్) ప్రాజెక్టును సరికొత్తగా రూపాంతరం చెందించనున్నారు. సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం (ఏబీపీ) కింద ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా పట్టాలెక్కించడంపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సచివాలయం నుంచి ఉన్నత స్థాయి దృశ్య శ్రవణ సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
*త్వరలోనే ఒప్పందం..
నిధుల విడుదలపై చర్చ
రాష్ట్రంలో సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడానికి వీలుగా ముఖ్యమంత్రి పలు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాన్ని (MoU) వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు, మండలం నుంచి గ్రామ పంచాయతీల వరకు ఉన్న రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను 'డిజిటల్ భారత్ నిధి' (గతంలో యూఎస్‌ఓఎఫ్) కి బదిలీ చేసే ప్రక్రియపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ప్రస్తావించారు. దీనిపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందిస్తూ.. తెలంగాణ డిజిటల్ పురోగతికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి ఆర్థిక, సాంకేతిక సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు వీలుగా ఒక 'ప్రత్యేక ప్రయోజన సంస్థ' (స్పెషల్ పర్పస్ వెహికిల్ - SPV) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో ఈ సంస్థ నేరుగా ఒప్పందం కుదుర్చుకోనుంది. తద్వారా నిజమైన డిజిటల్ తెలంగాణ సాధనకు బలమైన పునాది పడనుంది. ఈ డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఒకే రకమైన సమీకృత డిజిటల్ వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎకోసిస్టమ్) అందుబాటులోకి రానుంది.
*‘రింగ్ ఆర్కిటెక్చర్’ అంటే ఏమిటి?
టీ-ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీని 'రింగ్ ఆర్కిటెక్చర్' (వలయ అనుసంధాన)పద్ధతిలో అనుసంధానించనున్నారు. సాంకేతికంగా ఇది అత్యంత సురక్షితమైన విధానం.
*ప్రయోజనం:ఒక మార్గంలో కేబుల్ దెబ్బతిన్నా లేదా సాంకేతిక అంతరాయం ఏర్పడినా.. మిల్లీ సెకన్ల వ్యవధిలోనే మరో ప్రత్యామ్నాయ మార్గం (రిడండెంట్ పాత్) ద్వారా డేటా ప్రసారమై ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఈ-గవర్నెన్స్, టెలిమెడిసిన్ సేవలకు ఎలాంటి బ్రేకులు పడవు.
*తొలి దశలో 3,089 గ్రామాల్లో పునరుద్ధరణ:
గతంలో నెట్‌వర్క్ దెబ్బతిన్న, కనెక్టివిటీ లేని ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి దశలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని '3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామాల్లో ఆధునిక, భవిష్యత్ 5G అవసరాలకు తగ్గట్టుగా ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలను కల్పించి, రాష్ట్రంలోని మిగతా నగరాలతో సమానంగా డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయనున్నారు.
*లబ్ధి చేకూరే రంగాలు (గణాంకాలు - అంచనాలు):
*విద్య: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు హైస్పీడ్ ఇంటర్నెట్. డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు సులువు కానుంది.
*వైద్యం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHC) టెలిమెడిసిన్ కనెక్టివిటీ. హైదరాబాద్‌లోని నిపుణులైన వైద్యుల సేవలు పల్లెల్లోనే అందుబాటులోకి వస్తాయి..jpeg)
*పాలన: మీసేవ, ఈ-పంచాయతీ ద్వారా ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా పౌరులకు అందుతాయి. దాదాపు 4,000 కు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు లబ్ధి చేకూరనుంది.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి డి. అనుదీప్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఐటీ శాఖల పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..jpeg)
