సంస్కృతుల వారధి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’
- ఈశాన్య రాష్ట్రాలతో పెరిగిన బంధం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- *లోక్‌భవన్‌లో ఐఐఎం షిల్లాంగ్ విద్యార్థుల సందడి.
హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడికి అద్భుతమైన వేదికగా నిలుస్తోందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ (రవాణా, సాంస్కృతిక అనుసంధానం) పెరిగిందని, తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా భారతావనికి సాంస్కృతికంగా మరింత చేరువయ్యాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ – యువ సంగమ్’ (ఆరో విడత) కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
*జాతీయ సమగ్రతకు యువతే కీలకం
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలపై పరస్పర అవగాహన పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరించారు. యువత దేశ సమైక్యతను, జాతీయ సమగ్రతను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ చరిత్ర, విశిష్ట సంస్కృతి, ఇక్కడి అభివృద్ధి విశేషాలను అధికారులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, వరంగల్ నిట్ (NIT) ప్రొఫెసర్లు కిరణ్ కుమార్, సునీల్ కుమార్, కో-నోడల్ అధికారి ప్రొఫెసర్ పెరుగు శ్యామ్, నోడల్ అధికారి ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..jpeg)
