చదువుల పేరిట చైన్‌ ‘దోపిడీ’!

  • నిబంధనలు 'నారాయణ' పాలు.. చట్టాలు 'శ్రీచైతన్య' వశం!
  • *అనుమతులు లేవు.. గుర్తింపు లేదు.. కోర్టు ఆదేశాలూ తుంగలోకి!
  • *అపార్ట్‌మెంట్లలో మృత్యుగూళ్లు.. ఫైర్‌ ఎన్‌ఓసీల్లేని క్యాంపస్‌లు.
  • విద్యాశాఖ మంత్రి ,సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..!
  • *ర్యాంకుల భ్రమలతో సామాన్యుడి జేబుకు చిల్లులు.. విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లుండటమే కారణమా?
  • ఫోరం ఫర్ యాంటీకరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..!

చదువుల పేరిట చైన్‌ ‘దోపిడీ’!

తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థల చైన్ 'దోపిడీ' అరాచక పరాకాష్టకు చేరింది. పవిత్రమైన విద్యను వ్యాపార సరుకుగా మార్చి, నిబంధనలను నారాయణ పాలు, చట్టాలను శ్రీచైతన్య వశం చేస్తూ సామాన్యుడి రక్తాన్ని పిండుతున్నారు. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి, అనుమతులు లేని 'మృత్యుగూళ్ల' వంటి అపార్ట్‌మెంట్లలో ఫైర్ ఎన్‌ఓసీ లేకుండా వేలాది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ర్యాంకుల భ్రమలు, కృత్రిమ సీట్ల కొరతతో లక్షల ఫీజులు లూటీ చేస్తూ, లెక్చరర్ల శ్రమను దోచుకుంటున్నారు. విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈ మాఫియా విస్తరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ తక్షణమే ఉక్కుపాదం మోపి, ఫీజు నియంత్రణ చట్టాన్ని తెచ్చి ఈ విద్యా అరాచక సామ్రాజ్యాన్ని ప్రక్షాళన చేయాలి.

హైదరాబాద్‌: 
తెలంగాణలో విద్యా రంగం కార్పొరేట్ వ్యాపార శక్తుల గుప్పిట్లో నలిగిపోతోంది. పవిత్రమైన విద్యా సేవ ముసుగులో నారాయణ, శ్రీ చైతన్య, ఎస్ ఆర్, గాయత్రి వంటి చైన్ విద్యా సంస్థలు సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండేస్తున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ విద్యా వ్యాపార ధోరణిపై విద్యాశాఖ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, చట్టాల లొసుగులతో సాగుతున్న ఈ విద్యా దోపిడీపై "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్" సంస్థ జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి.WhatsApp Image 2026-05-28 at 19.31.47 (1)

*హైకోర్టు హెచ్చరించినా మొండివైఖరే!
తెలంగాణ విద్యా చట్టం (1982)తో పాటు ఇంటర్మీడియట్ విద్యా మండలి నిబంధనలను ఈ కార్పొరేట్ సంస్థలు పూర్తిగా పక్కనబెట్టేశాయని ఫోరం నివేదిక స్పష్టం చేస్తోంది. ముందస్తు అనుమతులు, కనీస అనుబంధ గుర్తింపు లేని వందలాది అక్రమ క్యాంపస్‌లను నిస్సిగ్గుగా నడుపుతున్నారు.

*68 జూనియర్ కళాశాలలను మూసేయమన్నా..: బోర్డు అనుమతి లేకుండా అక్రమంగా అడ్మిషన్లు సాగిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య సంస్థలకు చెందిన 68 జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఒక ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఆదేశించింది. ఇంతటి తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడినా, నేటికీ క్షేత్రస్థాయిలో అదే ధోరణి కొనసాగుతుండటం గమనార్హం.

మరోవైపు విద్యా క్యాలెండర్‌ను ఈ సంస్థలు తమ వ్యాపార ప్రణాళికగా మార్చేశాయి. వేసవి సెలవుల నిబంధనలకు విరుద్ధంగా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే "సమ్మర్ క్యాంప్"ల పేరిట తరగతులు మొదలుపెట్టి విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో శ్రీ చైతన్యకు ₹1.40 కోట్లు, నారాయణకు ₹62 లక్షల భారీ జరిమానాలు విధించినా, వస్తున్న లాభాల ముందు ఈ జరిమానాలు వాటికి లెక్కలేకుండా పోయాయి.WhatsApp Image 2026-05-28 at 19.31.47

*ప్రకటనల మాయాజాలం.. లూటీల పర్వం:
తల్లిదండ్రుల బలహీనతలను, పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆశలను ఈ సంస్థలు పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉన్నా, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ప్రత్యేక శిక్షణ, ఏసీ తరగతి గదుల పేరిట వార్షిక ఫీజులను లక్షల్లో గుంజుతున్నారు.

*కృత్రిమ కొరత - ముందస్తు లూటీ: నవంబర్, డిసెంబర్ నెలల నుంచే "సీట్లు అయిపోతున్నాయి" అంటూ కృత్రిమ కొరతను సృష్టించి అడ్వాన్సులు వసూలు చేస్తారు. ఆ తర్వాత ఒకవేళ సీటు రద్దు చేసుకుంటే పైసా వెనక్కి ఇవ్వరు. 

*అంతర్గత ఏకఛత్రాధిపత్యం: పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, బెల్టులు, బూట్లు వంటి ప్రతీ వస్తువును మార్కెట్ ధర కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ క్యాంపస్‌లలోనే కొనాలనే నిబంధన విధిస్తారు. 

*ర్యాంకుల కొనుగోలు చదరంగం:  రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకులు అంటూ ఒకే విద్యార్థి ఫోటో నాలుగైదు సంస్థల ప్రకటనల్లో కనిపిస్తుంది. ప్రతిభ గల విద్యార్థులను ముందే కొనుగోలు చేసి, తమకే ర్యాంకులు వచ్చాయంటూ సామాన్యులను భ్రమల్లో ముంచుతున్నారు. 

*అపార్ట్‌మెంట్లలో 'మృత్యు గూళ్లు'.. ఫైర్ సేఫ్టీ శూన్యం:
ఈ కార్పొరేట్ సంస్థల క్యాంపస్‌లలో మెజారిటీ భాగం ఇరుకైన అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలలోనే నడుస్తున్నాయని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధారాలతో సహా నిరూపించింది. వీటిలో కనీస గాలి, వెలుతురు ఉండవు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, వీటికి కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాల పత్రం (ఫైర్.ఎన్.సి) కూడా లేదు. విపత్తు నిర్వహణ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి, వేలాది మంది విద్యార్థులను ఒకేచోట గొర్రెల మందల్లా కుక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనా అని తల్లిదండ్రులు వణికిపోతున్నారు.

*లెక్చరర్ల శ్రమ దోపిడీ.. పన్నుల ఎగవేత
లాభాపేక్ష లేని సంస్థల (నాట్ ఫర్ ప్రాఫిట్) పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకుని, ప్రభుత్వం నుండి భూములు, పన్ను మినహాయింపులు పొందుతూ.. లోపల మాత్రం వందల కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. ఇది వ్యవస్థీకృత పన్ను ఎగవేత దందాయేనని విమర్శలు వస్తున్నాయి.
ఇక వీరి వద్ద పనిచేసే ప్రైవేట్ లెక్చరర్లు, ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు 12 నుండి 14 గంటలు పనిచేయించుకుంటూ, శ్రమకు తగ్గ కనీస వేతనాలు ఇవ్వడం లేదు. భవిష్య నిధి (పిఎఫ్), ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) వంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలు లాభాలను మూటగట్టుకుంటున్నాయి.

*ర్యాంకుల యంత్రాలు: బలిపీఠాలపై విద్యార్థుల ప్రాణాలు!
శాస్త్రీయమైన విద్యా విధానం ఎప్పుడూ విద్యార్థి మానసిక వికాసానికి తోడ్పడాలి. కానీ, ఈ చైన్ సంస్థలలో ఆట స్థలాలు ఉండవు, శారీరక శ్రమకు తావుండదు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కారాగారాల వంటి గదుల్లో బంధిస్తున్నారు. మార్కుల ఆధారంగా 'సెక్షన్ల' విభజనలు చేస్తూ, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ అశాస్త్రీయ, అమానవీయ పోకడల వల్లే ప్రతి ఏటా తెలంగాణలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు బలవుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడి కారణంగా జరుగుతున్న ఈ మరణాలు ముమ్మాటికీ వ్యవస్థీకృత హత్యలేనని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.WhatsApp Image 2026-05-28 at 19.31.06

*ప్రభుత్వం తక్షణమే ప్రక్షాళన చేపట్టాలి
గత పాలకుల ఉదాసీనత, విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్లే ఈ విద్యా మాఫియా ఇంతలా విస్తరించిందని ఫోరం తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉన్నందున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ఈ వ్యవహారంపై తక్షణమే ఉక్కుపాదం మోపాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 *ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్.ఆర్.సి): ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ సిఫార్సులను దుమ్ము దులిపి, ప్రైవేట్ ఫీజుల నియంత్రణకు తక్షణమే చట్టాన్ని అమలు చేయాలి.

 *కఠిన చర్యలు: నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రతీ అక్రమ బ్రాంచ్‌ను సీజ్ చేయాలి.

 క్రిమినల్ కేసులు: విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
విద్యా వ్యాపార సామ్రాజ్యాల అక్రమాలకు అడ్డుకట్ట వేసి, సామాన్యుడికి 'విద్యా హక్కు'ను కాపాడాలని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో కోరుతోంది.

About The Author