గోపాలపూర్ ఊర చెరువు పూడికతీత పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
జనగామ:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఊర చెరువు సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పూడికతీత పనులకు స్థానిక శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువు సామర్థ్యం పెరిగి వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల్లో ఎదురయ్యే వరద ముంపు సమస్యలను తగ్గించేందుకు ఈ పూడికతీత పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం అవసరమని, చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
