ఫ్యూచర్ సిటీలో భూముల ‘ధర’హాసం!

  • ​రావిర్యాలలో గజం రూ. 83,500.. హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్
  • ​నాలుగు ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి రూ. 140 కోట్ల ఆదాయం

ఫ్యూచర్ సిటీలో భూముల ‘ధర’హాసం!

హైదరాబాద్:

రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. పెద్దపెద్ద వెంచర్లు చేపట్టేందుకు అనువైన క్లియర్ టైటిల్ భూములకు మార్కెట్‌లో భారీ డిమాండ్ పలుకుతోంది. ముఖ్యంగా వివాదాలు లేని ప్రభుత్వ హౌసింగ్ బోర్డు స్థలాలను దక్కించుకునేందుకు కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, ఫ్యూచర్ సిటీ ప్రవేశ ద్వారం (ఎంట్రన్స్) వద్ద, శంషాబాద్ విమానాశ్రయానికి (ఎయిర్‌పోర్ట్) సమీపంలో ఉన్న రావిర్యాల భూములకు గురువారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలం (ఇ-ఆక్షన్)లో రికార్డు ధరలు పలికాయి.

​ఇక్కడ ఉన్న నాలుగు ల్యాండ్ పార్సిళ్లకు (భూములకు) నిర్వహించిన వేలంలో చదరపు గజం ధర గరిష్టంగా రూ. 83,500 పలికినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 140 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు.

*​గజం కనీస ధర రూ. 26 వేలు.. పలికింది రూ. 83,500!
​ఈ భూముల విక్రయానికి సంబంధించి హౌసింగ్ బోర్డు గత నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ స్థలాలను దక్కించుకునేందుకు దాదాపు 17 ప్రముఖ నిర్మాణ సంస్థలు, డెవలపర్లు పోటీ పడ్డారు. ముఖ్యంగా 1,113 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీనికి అధికారులు కనీస ధరగా (అప్‌సెట్ ప్రైస్) గజానికి రూ. 26,000 నిర్ణయించగా.. వేలంలో ఏకంగా రూ. 83,500 పలుకుతూ ఒక డెవలపర్ సంస్థ దీనిని దక్కించుకుంది. అలాగే, ఇదే ప్రాంతంలోని దాదాపు 6,000 చదరపు గజాల విస్తీర్ణం గల మరో ప్లాట్ గజానికి రూ. 62,500 చొప్పున అమ్ముడుపోయింది. మరో 13,500 చదరపు గజాల పెద్ద ప్లాట్‌ను దక్కించుకునేందుకు సైతం బిడ్డర్లు భారీగా పోటీ పడ్డారు. మొత్తంగా ఈ నాలుగు ప్లాట్ల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ. 140 కోట్ల మేర భారీ ఆదాయం లభించింది.
​నేడు కేపీహెచ్‌బీ, చింతల్ భూములకు వేలం
​రావిర్యాల వేలం విజయవంతం కావడంతో శుక్రవారం మరికొన్ని కీలక ప్రాంతాల్లోని స్థలాలను వేలం వేసేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధమైంది. కేపీహెచ్‌బీ కాలనీతో పాటు కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ ప్రాంతాల్లో ఉన్న మరో నాలుగు ప్లాట్లకు శుక్రవారం ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నారు.

 కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 1-2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్ నంబర్ 2తో పాటు.. కుత్బుల్లాపూర్ చింతల్ పరిధిలోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను ఈ వేలంలో విక్రయించనున్నారు. ఐటీ కారిడార్‌కు, నగరానికి కీలకమైన ఈ ప్రాంతాల్లోని స్థలాలకు కూడా భారీగా ధరలు పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.WhatsApp Image 2026-05-28 at 19.55.41

About The Author