అవినీతి ‘రవాణా’.. ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ పంజా!

  • మేడ్చల్, కొండాపూర్, నాగోల్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు
  • *దళారుల గుప్పిట్లో కంప్యూటర్లు, రికార్డు గదులు.. పక్కదారి పట్టిన వందలాది లైసెన్సులు, ఆర్‌సీలు.
  • *పరీక్షల్లేవు.. తిరస్కరణల్లేవు.. అంతా ‘కోడ్’ భాషలోనే లంచాల దందా!

అవినీతి ‘రవాణా’.. ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ పంజా!

హైదరాబాద్:

రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయనే ఆరోపణల నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగరం, పరిసర జిల్లాల పరిధిలోని మూడు ప్రధాన ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మేడ్చల్, కొండాపూర్, నాగోల్ ఆఫీసుల్లో జరిగిన ఈ దాడుల్లో దిగ్భ్రాంతికరమైన అక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, దళారులు, ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులతో చేతులు కలిపి అధికారులు సాగిస్తున్న అడ్డగోలు దందాను ఏసీబీ బట్టబయలు చేసింది.

*మేడ్చల్: అప్లికేషన్లపై ‘కోడ్’ ముద్ర!
మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వద్ద అసలు దరఖాస్తుదారులు లేకుండానే, ఒక ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు నాలుగు అప్లికేషన్లతో పట్టుబడ్డాడు. లెర్నర్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) ఇప్పించడానికి, నిబంధనలను పక్కనబెట్టడానికి అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. కార్యాలయంలోని దరఖాస్తులను పరిశీలించగా, ఏజెంట్ల పేర్లు, ప్రత్యేక కోడ్‌లు రాసి ఉన్నాయి. ఈ కోడ్ ఉంటే చాలు.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు, అభ్యంతరాలు లేకుండా ఫైళ్లను చకచకా క్లియర్ చేస్తున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.

*కొండాపూర్: పోస్టులో వెళ్లాల్సిన కార్డులు ఏజెంట్ల జేబుల్లో..
నిబంధనల ప్రకారం వాహనదారుల ఇళ్లకు స్పీడ్ పోస్ట్ ద్వారా చేరాల్సిన వందలాది డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను (ఆర్‌సీలు) కొండాపూర్ కార్యాలయ సిబ్బంది పక్కదారి పట్టించారు. పౌరులకు పంపకుండా ఆపి ఉంచిన సుమారు 150 ముద్రించిన కార్డులను అనధికార వ్యక్తులు, ఏజెంట్ల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెస్ట్ ట్రాక్ వద్ద డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు తాము తెచ్చిన అభ్యర్థుల జాబితాతో తిరుగుతూ, పరీక్షలతో సంబంధం లేకుండా అందరినీ పాస్ చేయించాలని రవాణా శాఖ అధికారులపై ఒప్తిడి తెస్తూ దొరికిపోయారు.

*నాగోల్: 185 అప్లికేషన్లు.. ‘సున్నా’ రిజెక్షన్లు!
నాగోల్ కార్యాలయంలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఏజెంట్ల నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లంచాలు వసూలు చేస్తూ, వారిని ఆఫీసు లోపలికి స్వేచ్ఛగా అనుమతించారు. దాడుల సమయంలో కార్యాలయం లోపల 7 గురు డ్రైవింగ్ స్కూల్ యజమానులు, 8 మంది ఇన్‌స్ట్రక్టర్లు తిష్టవేసి ఉండగా.. వారి వద్ద నుంచి రూ.41,130 నగదును సీజ్ చేశారు.

 *ఒక్కడి వద్దే 184 లైసెన్సులు: సుధాకర్ రెడ్డి అనే ఒకే ఒక్క ఏజెంట్ వద్ద ఏకంగా 184 డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లభ్యమవడం కలకలం రేపింది. తపాలా శాఖ ద్వారా పంపాల్సిన ఈ కార్డులను డిస్పాచ్ సెక్షన్ సిబ్బంది నేరుగా ఏజెంట్ చేతికే పెట్టడం వెనుక పెద్ద ఎత్తున లంచాలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు.WhatsApp Image 2026-05-28 at 18.09.13

 *ట్రాక్ పై డ్రైవింగ్ స్కూల్ కార్లు: డ్రైవింగ్ పరీక్ష రాసే సమయంలో అభ్యర్థుల పక్కన డ్రైవింగ్ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్లు కూర్చోవడానికి అధికారులు అనుమతించారు. దీనివల్ల డ్రైవింగ్ రాని వారికి కూడా లైసెన్సులు దక్కుతున్నాయి. తనిఖీ జరిగిన రోజు పరిశీలించిన 185 దరఖాస్తుల్లో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాకుండా అన్నింటినీ ఆమోదించడం గమనార్హం. దరఖాస్తులపై డ్రైవింగ్ స్కూల్ వాహనాల నంబర్లను కోడ్ భాషగా రాసి లంచాలు వసూలు చేసినట్లు గుర్తించారు.

*ప్రభుత్వ కంప్యూటర్లపై దళారుల రాజ్యం
ఈ మూడు ఆర్టీఏ ఆఫీసుల్లోనూ దళారుల హవా నడుస్తోంది. లైసెన్స్ విభాగాలు, ఆర్‌సీ గదులు, ఆఖరికి ప్రభుత్వ అధికారిక కంప్యూటర్లను సైతం ఏజెంట్లు యథేచ్ఛగా వాడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆన్‌లైన్ లో పౌరులు ప్రభుత్వ ఫీజులు చెల్లించినప్పటికీ, ఈ దళారులే కార్డులను ఆఫీసుల నుంచి దొంగిలించి, అదనపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను లూటీ చేస్తున్నారు. పలు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు కూడా బయటపడటంతో వీటిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

*నివేదిక సిద్ధం.. లంచం అడిగితే ‘1064’కు ఫోన్ చేయండి.
ఈ ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఏసీబీ సిద్ధం చేస్తోంది. అక్రమాలకు బాధ్యులైన ఆర్టీఏ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించనుంది.
రవాణా శాఖతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే పౌరులు తక్షణమే కింది నంబర్లను సంప్రదించాలని ఏసీబీ కోరింది:
 *ఉచిత హెల్ప్‌లైన్ నంబర్: 1064,
 వాట్సాప్ నంబర్: 9440446106,
 *సామాజిక మాధ్యమాలు: ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (ట్విట్టర్) (@Telangana_ACB)
   *(ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి).WhatsApp Image 2026-05-28 at 18.17.06

About The Author