రూపాయి పతనంతో విదేశీ విద్యార్థుల బతుకు భారం!
- ఒక పూట భోజనం.. కిలోమీటర్ల నడక..
- *పరాయి దేశాల్లో భారతీయుల దీనావస్థపై కప్పాటి పాండురంగా రెడ్డి ఆవేదన.
- *ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి
హైదరాబాద్:
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ నానాటికీ క్షీణించడం కేవలం చమురు దిగుమతులు, స్టాక్ మార్కెట్లు, దేశ వాణిజ్య లోటుకు మాత్రమే పరిమితమైన అంశం కాదని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. ఇది విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థుల జీవితాలను చీకట్లోకి నెడుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై చదువుకుని, కుటుంబాలకు అండగా నిలవాలని ఎన్నో ఆశలతో వెళ్లిన సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి నేడు చదువు కంటే.. 'రోజు ఎలా గడవాలి? మనుగడ ఎలా సాగించాలి?' అనే దైన్య స్థితికి చేరుకోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.
*భారంగా మారిన జీవన వ్యయం
రూపాయి బలహీనపడటంతో విదేశాల్లో జీవన వ్యయం భరించలేనంతగా పెరిగిపోయిందని పాండురంగా రెడ్డి వివరించారు. భారతదేశం నుండి తల్లిదండ్రులు పంపే డబ్బు అక్కడి కనీస అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సంపన్న కుటుంబాల పిల్లలు మినహా, మిగిలిన సాధారణ విద్యార్థులంతా రోజువారీ బడ్జెట్ కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తోందని చెప్పారు.
*ఒక పూట భోజనంతోనే సరి: ఖర్చులు తగ్గించుకోవడానికి విద్యార్థులు రోజుకు ఒక పూట మాత్రమే తింటూ, కొన్నిసార్లు అసలు భోజనాన్ని కూడా మానేస్తూ లంకణాలు ఉంటున్నారు.
*కిలోమీటర్ల నడక: బస్సు, సబ్‌వే ఛార్జీలు కూడా భరించలేని స్థితిలో, నిత్యం కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణిస్తూ విద్యార్థులు శారీరకంగా తీవ్ర అలసటకు గురవుతున్నారు.
*చదువుపై పడుతున్న ప్రభావం
ఆకలితో అలమటిస్తూ, కేవలం బతుకుదెరువు కోసమే నిరంతరం పోరాడుతున్న విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం సాధ్యం కాదని పాండురంగా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మానసిక, శారీరక ఒత్తిడి వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాకుండా.. వారి విద్యా నైపుణ్యాలను, గ్రేడ్‌లను కూడా దారుణంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ గర్వకారణంగా ఎదగాల్సిన యువత, విదేశాల్లో కనీస అవసరాల కోసం అల్లాడిపోవడం దేశానికే నష్టమని హెచ్చరించారు.
*ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
డాలర్‌తో రూపాయి పతనాన్ని కేవలం ఆర్థిక గణాంకాల కోణంలోనే చూడకుండా, దీని వెనుక ఉన్న మానవీయ కోణాన్ని, విద్యార్థుల దీన పరిస్థితులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా రంగ నిపుణులు తక్షణమే స్పందించి ఈ సంక్షోభంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించాలని లేదా ప్రత్యేక స్కాలర్‌షిప్ మార్గాలను పరిశీలించి వారిని ఆదుకోవాలని కప్పాటి పాండురంగా రెడ్డి ప్రభుత్వాలను కోరారు.
