రిజిస్ట్రేషన్ల రద్దీకి ‘టైమ్’ చెక్!

  • సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పని వేళలు
  • *మే 29 నుంచి జూన్ 3 వరకు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:30 దాకా సేవలు
  • *సర్కార్ భూముల విలువల సవరణ నిర్ణయంతో ఎగబడ్డ జనం.
  • *స్లాట్ల సంఖ్య పెంపు.. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగింపు
  • *‘భారత శక్తి’ దినపత్రిక ప్రత్యేక కథనం.

రిజిస్ట్రేషన్ల రద్దీకి ‘టైమ్’ చెక్!

హైదరాబాద్: 

 రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రద్దీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలన్న క్యాబినెట్ నిర్ణయంతో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు (SRO) జనసంద్రంగా మారాయి. కొత్త ధరలు అమల్లోకి వస్తే స్టాంప్ డ్యూటీ భారం పెరుగుతుందనే ఆందోళనతో కొనుగోలుదారులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. ఈ అనూహ్య తాకిడిని తట్టుకునేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

*రాత్రి 7:30 గంటల వరకు ఆఫీసులు ఓపెన్:
ఇకపై రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు "ఉదయం 9:30 గంటల నుంచే సేవలు ప్రారంభించి, రాత్రి 7:30 గంటల వరకు, నిరంతరాయంగా పనిచేయనున్నాయి. కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశారు. డిమాండ్‌ను బట్టి అవసరమైతే అదనపు సమయంతో పాటు, మరిన్ని రోజులు కూడా పని వేళలను పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

*పెరగనున్న స్లాట్ బుకింగ్స్.. ధరణితో సమన్వయం
సాధారణ రోజుల్లో ఉండే ముందస్తు అనుమతుల (స్లాట్ బుకింగ్) సంఖ్యను రద్దీకి అనుగుణంగా పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సర్వర్లపై సాంకేతిక ఒత్తిడి పడకుండా ఐటీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహసీల్దార్ కార్యాలయాలతో (ధరణి) నిరంతరం సమన్వయం పెంచుకోవాలని, ఎక్కడా ఆలస్యం లేకుండా సేవలు అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విలువల సవరణ ద్వారా రిజిస్ట్రేషన్ల సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ సమానమైతే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నగదు రూపంలో జరిగే నల్లధనం చలామణికి అడ్డుకట్ట పడటంతో పాటు, పారదర్శకత పెరుగుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వ విలువ పెరగడం వల్ల సామాన్యులకు బ్యాంకుల నుంచి లభించే గృహ, భూ రుణాలు సులభంగా, ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. దీనితో పాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం కూడా భారీగా పెరగనుంది.

*దళారీల ఆటలు సాగవు: ఐజీకి మంత్రి ఆదేశాలు
 "ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ధ్యేయం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం, పారదర్శకత, సౌకర్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం. కార్యాలయాల చుట్టూ దళారులు తిరిగితే సహించేది లేదు."WhatsApp Image 2026-05-27 at 19.58.38

*పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి

ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) రాజీవ్ గాంధీ హనుమంతుకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని కార్యాలయాల వద్ద తాగునీరు, నీడ (షామియానాలు) వంటి కనీస వసతులుసరీగా కల్పించాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా సీసీ కెమెరాల నిఘాలో ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.WhatsApp Image 2026-05-27 at 19.58.37 (1)

About The Author