జీపు జాతాను జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు
సూర్యాపేట:
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ జనవరి 9 నుండి11 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరిగే జీపు జాతాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 సంవత్సరాలుగా అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి మనుగడకే ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా పోరాడి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలకు రద్దు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయకుండా విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చి రైతాంగం మెడకు ఉరిపెట్టే విధంగా చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విబి జి రామ్ జి పేరు మార్చి పోరాడి సాధించిన చట్టాన్ని పథకంలో మార్చిందన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడంలో అర్థం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనవరి 9 నుండి11 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో జీబుజాత నిర్వహిస్తున్నామని ఈ జాతాను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం రాంబాబు, రైతు సంఘం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దుగ్గి బ్రహ్మం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు జంపాల స్వరాజ్యం పాల్గొన్నారు
