గ్యాస్ డెలివరీ వర్కర్ మృతి బాధాకరం – కుటుంబానికి న్యాయం చేయాలి: శ్రీనివాస్ గౌడ్

గ్యాస్ డెలివరీ వర్కర్ మృతి బాధాకరం – కుటుంబానికి న్యాయం చేయాలి: శ్రీనివాస్ గౌడ్

మహేశ్వరం:

తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహేశ్వరం రూమా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న గడ్డి కొండలు సన్నాఫ్ కిష్టయ్య (వయసు 45) అనే డెలివరీ వర్కర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ప్రోమో గ్యాస్ రూమా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కిష్టయ్య, ఈ నెల 5వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో మహేశ్వరం కమాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి, అనంతరం శంషాబాద్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం తెలిపారు. అనంతరం మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో సీఐని కలిసి ఘటన వివరాలను చర్చించారు. అలాగే రూమా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి మేనేజర్ రఘుతో ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మృతుడికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల అతని కుటుంబంపై సుమారు రూ.5 లక్షల వరకు ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా గ్యాస్ ఏజెన్సీలు తప్పనిసరిగా డెలివరీ వర్కర్లకు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సదుపాయాలు లేకపోవడం వల్ల వర్కర్ మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై త్వరలో ఆయిల్ కంపెనీల యాజమాన్యాలను కలిసి చర్చిస్తామని, డెలివరీ వర్కర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత రెండు నెలల్లోనే నలుగురు గ్యాస్ డెలివరీ వర్కర్లు మృతి చెందడం చాలా బాధాకరమని, యాజమాన్యాల ఒత్తిడే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

About The Author

Related Posts