రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
ఈ నెల 16వ తేదీన నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు అవసరమైన త్రాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సభకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
