జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు...
- ఆన్‌లైన్ బెట్టింగ్, అక్రమ పశువుల రవాణా ముఠాలపై ఉక్కుపాదం..
- జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
వరదలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సీసీ కెమెరాల విస్తరణతో స్మార్ట్ పోలీసింగ్ పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగిసిన ఏడాది గంజాయి సాగు 99% నిర్మూలన – డ్రగ్స్‌పై కఠిన చర్యలు..
CEIR పోర్టల్ ద్వారా ₹2.16 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ.. డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు..
ప్రజల సహకారంతోనే జిల్లాలో నేరాల నియంత్రణ సాధ్యమైంది అన్నారు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల..
జిల్లాలో ఈ సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత చర్యలు మరియు సాధించిన ప్రగతిని ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ వార్షిక ప్రెస్‌మీట్ ద్వారా వివరాలను వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. పండుగలు, పంచాయతీ ఎన్నికలు, జాతరలు, భారీ సమావేశాల సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం జరిగింది.జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముఖ్యంగా హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, ఆన్‌లైన్ మోసాలు వంటి కేసుల్లో నేరస్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.అదే విదంగా పెండింగ్ కేసుల పరిష్కారంలో కూడా గణనీయమైన పురోగతి సాధించాం.మహిళలు, బాలల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది,ఇందుకోసం షీ టీమ్స్ ,AHTU, భరోసా సెంటర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు, చేపట్టాం.అదే విదంగా జిల్లా అంబిస్ టెక్నాలజీని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా అడుగులు వేయడం జరిగిందని ,CCTV నెట్‌వర్క్, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు.
పోలీస్ అక్క కార్యక్రమం మనకి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది.శివంగి టీం కూడా రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన నిర్మల్ జిల్లాలో శివంగి దళాన్ని ప్రారంభించడం జరిగింది. శివంగి టీం రెస్క్యూ ఆపరేషన్లు, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో విశేషంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చింది.
నారీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధించిన డయల్స్ అటెండ్ చేయడం, అలాగే విస్తృత స్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో 99% గంజాయి సాగు పూర్తిగా నిలిచిపోయింది.
జిల్లాలో రెండు నెలలు వరదలు సంభవించిన సమయంలో, ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ శాఖ తక్షణమే స్పందించింది. మంచిర్యాల్ చౌరస్తాలో మనిషి మునిగిపోయేంత నీరు చేరిన సందర్భంలో, రెండు గంటల పాటు పోలీసులు అక్కడే ఉండి నీటిని తొలగించి ట్రాఫిక్‌ను సకాలంలో పునరుద్ధరించారు.
వరదల సమయంలో పశువుల కాపరి చిక్కుకుపోయిన ఘటనలో, రెండు రోజుల పాటు శ్రమించి,సురక్షితంగా రక్షించగలిగాం.
CEIR పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు రూ. 2.16 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది.
చెప్పుకోదగ్గ మరో ముఖ్యమైన విషయం (పశువుల అక్రమ రవాణా) ముఠాను అరెస్టు చేయడం ద్వారా పశువుల అక్రమ రవాణా పూర్తిగా తగ్గింది.
గణేష్ నిమజ్జన బందోబస్తు పూర్తిగా ప్రశాంతంగా, ఎలాంటి లాఠీచార్జ్ లేకుండా విజయవంతంగా ముగిసింది.కమ్యూనిటీ భాగస్వామ్యంలో మహిళలకు సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.
గంజాగస్తీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు సౌకర్యం లేని గుమ్మన యంగ్లపూర్ గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వాలీబాల్ కిట్లు, రేషన్, దుప్పట్లు పంపిణీ చేశాం.
ఇంతకు ముందు నైట్ పెట్రోలింగ్ నిర్మల్, భైంసా పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం అది ముధోల్, ఖానాపూర్ ప్రాంతాల్లో కూడా ప్రారంభించడంతో దొంగతనాలు గణనీయంగా తగ్గాయి.
ట్రాఫిక్, సైబర్ క్రైమ్, ఉమెన్ పోలీస్ స్టేషన్‌ల కోసం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పంపించడం జరిగింది. అది ప్రస్తుతం ఆచరణ దశలో ఉంది.
నమోదైన నేరాలు: 2025లో జిల్లాలో 4162 నేరాలు నమోదయ్యాయి,హత్యలు, అత్యాచారాలు, అపహరణలు వంటి తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయడం జరిగింది. 2025లో మొత్తం 14 హత్య కేసులు నమోదయ్యాయి.
ప్రాపర్టీ కేసులు(దొంగతనాలు): 2025లో 517 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా, వాటిలో 149 కేసులు చేధించి రూ. ₹89,09,510/ విలువైన ఆస్తి రికవరీ చేయడం జరిగింది. రికవరీ శాతం(35.20%).SC/ST కేసులు:మొత్తం 22 కేసులు నమోదయ్యాయి.
ఇసుక అక్రమ రవాణా: 71 కేసులు నమోదు చేసి,వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.గేమింగ్ యాక్ట్: 299 కేసులు నమోదు చేసి, ₹8,87,925/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్: మొత్తం 7908 కేసులు నమోదు చేయగా, ముగ్గురికి జైలు శిక్షలు విధించబడ్డాయి.
రోడ్డు ప్రమాదాలు: 2025లో 660 మంది రోడ్డు ప్రమాదాల కు గురయ్యారు. ప్రమాదాలు నివారించేందుకు రోడ్ల పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ :
ఈ కార్యక్రమంలో భాగంగా 2025లో ఇప్పటివరకు ఎలాంటి గంజాయి కేసులు నమోదు కాలేదు. మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది.
డయల్-100 :
డయల్-100 కాల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంనుండైనా నేర సమాచారం అందుకున్న 5 నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడం జరిగింది.ఈ సంవత్సరంలో మొత్తం 22,327 డయల్ 100 కాల్స్ స్వీకరించి, తక్షణ చర్యలు చేపట్టాం.
ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్–XI :
2025 సంవత్సరంలో జనవరి, జూలై నెలల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్& ముస్కాన్–XI కార్యక్రమాలు నిర్వహించి, 123 మంది పిల్లలను రక్షించి, వారి కుటుంబాలకు అవగాహన కల్పించడం జరిగింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు–2025: 2025 సంవత్సరంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను మూడు దశల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో ప్రశాంతంగా ముగించడం జరిగింది.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలో భాగంగా 69 మద్యం అక్రమ రవాణాపై కేసులు నమోదు చేసి 1027 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్రమ నగదు తరలింపుపై 13 కేసులు నమోదు చేసి రూ.12,93,700 స్వాధీనం చేసుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘనలపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగింది.ఎన్నికల కాలంలో మొత్తంగా 201 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగింది.
సంచలనాత్మక కేసులు: భైంసా పోలీస్ స్టేషన్ పరిధిలోని గత ఏడాది కాలంగా మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి సుమారుగా కోటిన్నర విలువ గల ఆస్తుల స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది.అదేవిధంగా మత్తు ఇంజెక్షన్లతో గోవులను కబళించిన గ్యాంగ్‌కి చెక్ పెట్టి అంతర్రాష్ట్ర ముఠా ను అరెస్టు చేయడం జరిగింది.
సైబర్ నేరాలు: 2025లో 52 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 30 లక్షలకు పైగా నగదు బాధితులకు తిరిగి అందించామని తెలిపారు.
CEIR ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీ: 1806 పోయిన మొబైల్ ఫోన్లు గుర్తించి, ₹2.16 కోట్ల విలువైన ఫోన్లు బాదితులకు అందించామని తెలిపారు.
బందోబస్తు :
VIP/VVIP పర్యటనలతో పాటు, గణేష్ నవరాత్రులు, రంజాన్,వంటి అన్ని పండుగలు, జాతరల బందోబస్తు కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
సిసి కెమారాలు :
2025 సంవత్సరంలో ప్రజల సహకారంతో జిల్లా వ్యాప్తంగా 909 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జియో-ట్యాగింగ్ చేసి,వాటిని
జిల్లా కమాండ్ & కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేయడం జరిగింది.
గ్రీవెన్స్ డే :
ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి గ్రీవెన్స్ డే,శ్రీకారం చుట్టి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి చట్ట ప్రకారం న్యాయం చేయడం జరిగింది. భైంసా సబ్ డివిజన్ నుండి ప్రజలు నిర్మల్ రావడం ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో, ప్రతీ బుధవారం భైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుంది.
కమ్యూనిటీ పోలీసింగ్:
ఈ కార్యక్రమం లో భాగంగా నిరుపేద ఆదివాసీ బిడ్డలకు రేషన్ సరఫరా, యువతను వేరే చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడల వైపు మళ్లించేందుకు వారికి వాలీబాల్ కిట్లను పంపిణీ చేయటం జరిగింది.
యాంటీ–ర్యాగింగ్ కార్యక్రమం:
విద్యాసంస్థల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు యాంటీ– ర్యాగింగ్ చట్టాలు, విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ర్యాగింగ్ నివారణపై విద్యార్థులను చైతన్యపరచడం జరిగింది.
పోలీస్ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 350 పై చిలుకు మంది పోలీసులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, స్నేహపూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తూ, జిల్లా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని తెలుపుతూ జిల్లా ప్రజలకు మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల తో పాటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీన, నిర్మల్ ఏ ఎస్పీ సాయి కిరణ్,ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
