నివాసాలకు ‘హైడ్రా’ భరోసా!
- శేరిలింగంపల్లి సర్వే నం. 44లో ఆందోళన వద్దు..
- ప్రభుత్వ భూమిలో వాణిజ్య కట్టడాలపైనే ఉక్కుపాదం..
- ప్రజలను రెచ్చగొడుతున్న ఆక్రమణదారుల పట్ల అప్రమత్తత..
హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్త మహబూబ్‌పేట గ్రామంలోని సర్వే నంబరు 44 నివాసితులకు హైడ్రా (HYDRAA) కీలక భరోసా ఇచ్చింది. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్ల జోలికి వెళ్లబోమని, నివాసితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, భారీ వాణిజ్య సముదాయాలు నిర్మించిన వారిపైనే చర్యలు ఉంటాయని సంస్థ తేల్చి చెప్పింది.
రికార్డుల్లో సర్కారు భూమి..
సేత్వార్ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 44లోని మొత్తం 260.01 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. అయితే, ఈ భూమిలో చాలా కాలంగా అనేక నివాస గృహాలు వెలిశాయి. "హైడ్రా ఏర్పాటుకు ముందు (జులై 2024 కంటే ముందు) నిర్మించిన నివాసాలను తొలగించకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం. ఇదే నిబంధన ఇక్కడి నివాసితులకు వర్తిస్తుంది" అని అధికారులు వెల్లడించారు.
రెచ్చగొడుతున్న ‘బడా’ ఆక్రమణదారులు
నివాసితుల వెనుక దాక్కుని తమ అక్రమ వ్యాపారాలను కాపాడుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు హైడ్రా గుర్తించింది.jpeg)
తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరాల కొద్దీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.
షోరూంలు, దుకాణాలు నిర్మించి నెలకు లక్షల రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా ఫెన్సింగ్ వేస్తుంటే.. తమ వాణిజ్య అడ్డాను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను ఆక్రమణదారులు పావులుగా వాడుకుంటున్నారని అధికారులు హెచ్చరించారు.
గట్టి చర్యలకు ఉపక్రమం
ఈ ప్రాంతంలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సబ్ రిజిస్ట్రార్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా 'ప్రజావాణి'లో అందిన ఫిర్యాదుల మేరకు.. బీకే ఎన్‌క్లేవ్ చెరువు పరిసరాల్లోని 5 ఎకరాలతో పాటు, గత శని, ఆదివారాల్లో మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కేవలం అనుమతులు లేని కట్టడాలు, వాణిజ్య సముదాయాలనే తొలగించామని, ఆక్రమణదారులు వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని నివాసితులకు హైడ్రా విజ్ఞప్తి చేసింది
