అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు.!
-మండలంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన మైనింగ్ అధికారులు
-మైనింగ్ ఏడి దిలీప్ కుమార్

పినపాక :
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయాలని మైనింగ్ ఏడి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం పినపాక మండలంలో తహశీల్దార్ గోపాలకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ తో కలిసి ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాలను పరిశీలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే ప్రాంతాలను గుర్తించి ట్రంచ్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ కూపన్ ద్వారానే అధికారుల పర్యవేక్షణలో ఇసుకను పగటిపూట మాత్రమే రవాణా చేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా జరిగితే ఇందిరమ్మ కూపన్ మంజూరు చేసిన అధికారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే ఆ ఫోటోలు తీసి తమకు పంపించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. ఇసుక అక్రమ రవాణా వెనక ఎంతటి వారు ఉన్నా సహించేది లేదన్నారు. ఇసుక అక్రమంగా ఎత్తే కూలీలపై సైతం కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఎవరు సహకరించవద్దని తెలియజేశారు.
