నిర్మల్‌లో గడువు ముగిసిన మందుల అక్రమ నిర్వాహణ

- డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్‌కు సమాచారం ఇచ్చినా స్పందన కరువు.

WhatsApp Image 2025-12-30 at 4.27.26 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

నిర్మల్ జిల్లా కేంద్రంలో కొంతమంది ప్రైవేటు మెడికల్ షాపుల యజమానులు, ఔషధ ఏజెన్సీలు గడువు ముగిసిన మందులు, గోలీలు, సిరపులను జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డుపక్కనే నిర్లక్ష్యంగా పారవేయడంతో పాటు కొన్ని చోట్ల కాల్చివేయడం జరుగుతుండటంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా గడువు ముగిసిన మందులను బహిరంగ ప్రదేశాల్లో పడవేయడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, వీధి జంతువులకు తీవ్ర ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులను కాల్చే సమయంలో విడుదలయ్యే విషవాయువులు గాలిని కాలుష్యం చేసి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
కావాలని నిర్లక్ష్యమా? అవగాహన లోపమా?

ఈ విషయంలో మెడికల్ షాపుల యజమానులు చట్టాలు, నిబంధనలు తెలిసినా కూడా కావాలని ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? లేక బయో–మెడికల్ వేస్ట్ నిర్వాహణపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అనుమతి పొందిన బయో–మెడికల్ వేస్ట్ నిర్వాహణ ఏజెన్సీల సేవలను వినియోగించకుండా, ఖర్చు తగ్గించుకునేందుకు బహిరంగంగా మందులను పారవేయడం, కాల్చడం జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
డ్రగ్ ఇన్స్పెక్టర్‌కు సమాచారం ఇచ్చినా స్పందన లేదన్న ఆరోపణ

ఈ అక్రమ నిర్వాహణ వ్యవహారం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఫోన్ ద్వారా సమాచారం అందించిన సమయంలో “నేను ప్రస్తుతం అందుబాటులో లేను” అని సమాధానం ఇచ్చారని, ఆ తరువాత కూడా ఎలాంటి తనిఖీలు లేదా చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతటి తీవ్రమైన ప్రజారోగ్య సమస్యపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

చట్టాల ప్రకారం నేరం
గడువు ముగిసిన మందులను ఈ విధంగా బహిరంగంగా పారవేయడం, దహనం చేయడం పలు చట్టాలకు విరుద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్–1945 ప్రకారం గడువు ముగిసిన లేదా నాణ్యత లేని మందులను శాస్త్రీయ పద్ధతిలో, అనుమతి పొందిన విధానంలోనే నిర్వాహణ చేయాలి. ఉల్లంఘనకు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
బయో–మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2016 ప్రకారం మందులు, వైద్య వ్యర్థాలను అనుమతి పొందిన బయో–మెడికల్ వేస్ట్ నిర్వాహణ సంస్థల ద్వారానే తొలగించాలి. బహిరంగంగా పారవేయడం లేదా కాల్చడం చట్టరీత్యా నేరం. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం గాలి, నీటి కాలుష్యానికి కారణమయ్యే చర్యలు శిక్షార్హమైన నేరాలు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 268 (పబ్లిక్ న్యూసెన్స్) ప్రకారం ప్రజలకు ప్రమాదం కలిగించే చర్యలు నేరంగా పరిగణించబడతాయి. 

చర్యలు తీసుకోవాలని డిమాండ్ :
ఈ వ్యవహారంపై నిర్మల్ మున్సిపాలిటీ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, మున్సిపల్ హెల్త్ అధికారులు, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా గడువు ముగిసిన మందులను నిర్వాహణ చేస్తున్న మెడికల్ షాపులు, ఔషధ ఏజెన్సీలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెడికల్ షాపులకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్సుల రద్దు వరకు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

About The Author