ఆక్రమణదారుల గుప్పిట నుంచి పార్కు స్థలం విముక్తి..!

జొన్నబండలో రంగంలోకి దిగిన హైడ్రా 1444 గజాల స్థలానికి రక్షణగా ఫెన్సింగ్


ఆక్రమణదారుల గుప్పిట నుంచి పార్కు స్థలం విముక్తి..!

హైదరాబాద్:

ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా (HYDRAA) విముక్తి చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని జొన్నబండలో గురువారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. విలువైన ప్రభుత్వ భూమికి రక్షణ కవచం ఏర్పాటు చేశారు.

​ప్రజావాణిలో ఫిర్యాదు.. వెనువెంటనే చర్యలు
జొన్నబండలోని ఎంహెచ్‌ఆర్ కాలనీ లేఅవుట్ ప్రకారం.. సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598, 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే, ఈ స్థలంపై కొందరు కన్నేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీవాసులు ఇటీవల హైడ్రా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేశారు.
​రంగంలోకి అధికారుల బృందం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రెవెన్యూ రికార్డులు, లేఅవుట్ ప్లాన్లను నిశితంగా పరిశీలించి, సదరు స్థలం పార్కుకే చెందుతుందని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సిబ్బందితో కలిసి పార్కు చుట్టూ ఇనుప ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి బోర్డులను పాతారు.
​హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
కాలనీకి ఊపిరితిత్తుల్లాంటి పార్కు స్థలాన్ని కాపాడటంపై ఎంహెచ్‌ఆర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తీసుకున్న సత్వర చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్థలంలో ఇకపై ఎవరూ చెత్త వేయకుండా చూడాలని, తక్షణమే దీనిని పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరుతామని స్థానికులు పేర్కొన్నారు.

About The Author

Related Posts