బయ్యారం వరకు రోడ్డు మరమ్మతులు లైటింగ్ ఏర్పాటు చేయాలి.
అఖిలపక్ష పార్టీలు, కుల సంఘాలు డిమాండ్

మణుగూరు :
మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టి, లైటింగ్ ఏర్పాటు చేసి, ప్రమాదాలను, దుమ్ము, దూళి నివారించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అఖిలపక్ష పార్టీలు, కుల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) ఆధ్వర్యంలో మణుగూరు లోని స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అఖిలపక్ష పార్టీలు, సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల, సంఘాల నాయకులు మాట్లాడుతూ మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు గుంతల మయంగా తయారై, లైటింగ్ లేక అనేక ప్రమాదాలు జరిగి, అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసి, గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలు పడ్డ దగ్గర రోడ్డు మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, యాష్ కంకర పోసి చేతులు దులుపుకోవడం వలన విపరీతమైన దుమ్ము, దూళీ లేస్తూ ప్రయాణికులు ఈ ప్రాంతం గుండా ప్రయాణించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ రహదారి గుండా నిత్యం వందలాది ఇసుక లారీలు, బొగ్గు టిప్పర్లు ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. ఈ ప్రాంతంలో బి టి పి ఎస్, సింగరేణి, ఇసుక రీచ్లు ఉండి కోట్లాది రూపాయల సి ఎస్ ఆర్ నిధులు, డిఎంఎఫ్ నిధులు వస్తున్నా! ఈ రోడ్డు అభివృద్ధి పట్ల ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఈ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. లైటింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి స్తంబాలు వేసి, వైర్లు లాగి ఎందుకు వదిలేశారని, లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేసింది కాంట్రాక్టర్ల కోసమా? ప్రజల కోసమా? అని ప్రశ్నించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ధారు కు, ఎమ్మెల్యేకు, సబ్ కలెక్టర్, కలెక్టర్ లకు వినతి పత్రాలు అందజేసి, వారి దృష్టికి తీసుకెళ్లాలని, అప్పటికీ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్. మధుసూదన్ రెడ్డి, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా), దుగ్యాల. సుధాకర్ (సిపిఐ), పున్నం. బిక్షపతి (బిజెపి), వై. పూర్ణచందర్ రావు (టిడిపి), రవి(న్యూడెమోక్రసీ), గుర్రం. శ్రీనివాస్, (బీసీ సంఘం నాయకులు), బోయిళ్ళ. వెంకటేశ్వర్లు (ఎమ్మార్పీఎస్), బత్తుల. వెంకటేశ్వర్లు, జె. సూర్యనారాయణ రావు, తురక. మధు, తదితరులు పాల్గొన్నారు.
