గుఱ్ఱపు డెక్క ఆకును తొలగిస్తాం.. దోమల నివారణ చేపడతాం..

కాలనీవాసులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భరోసా..

గుఱ్ఱపు డెక్క ఆకును తొలగిస్తాం.. దోమల నివారణ చేపడతాం..

ఎల్బీనగర్

చెరువుల్లో గుఱ్ఱపు డెక్క ఆకు పెరిగి, దోమల భాద తట్టుకోలేక, కాలనీవాసుల భాదలు చూడలేక ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు, హయత్ నగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరికుంట చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపు డెక్క ఆకును శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వాకర్స్ మాట్లాడుతూ, ఇక్కడికి వాకింగ్ రావాలంటే దోమల వల్ల మాకు ఎక్కడ విష రోగాలు వస్తాయో అని భయపడుతున్నామని, దోమల ప్రభావం వల్ల చాలా మంది ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ రావడానికి జంకుతున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత భారాస ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద ఎంతో చిత్తశుద్ధితో ముందుచూపుతో ఆలోచించి నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో గుఱ్ఱపు డెక్క ఆకు పేరుకొనిపోకుండా కాలనీవాసుల సౌలభ్యం కోసం దోమల నివారణకు డ్రోన్స్ సహాయంతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి దోమల నివారణ గావించాం. అలాగే చెరువుల్లో దోమల వల్ల ఉత్పన్నం అయ్యే లార్వాను అరికట్టడానికి వేలాది గంబూజియా జాతికి చెందిన చేప పిల్లలను చెరువులోకి వదలడం వల్ల అవి లార్వాను మింగేయడం జరిగింది.తద్వారా దోమల వ్యాప్తి అరికట్టడం జరిగింది.అలాగే డ్రోన్ పరికరాన్ని ఉపయోగించి చెరువు మధ్యలోకి వెళ్లడం సాధ్యం కాని చోట్ల కూడా దోమల నివారణకు మందులు చల్లడం జరిగిందని గుర్తు చేశారు.కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాల మీద దృష్టి పెట్టకుండా చెరువుల్లో పెరుకుపోతున్న గుఱ్ఱపు డెక్క ఆకును తొలగించకుండా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తుంది. ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నా ఉలుకు, పలుకు లేదని అన్నారు.ప్రస్తుతం ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ కోసం రావాలంటే దోమల దండయాత్ర వల్ల ఎక్కడ మలేరియా,డెంగీ జ్వరాలు వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. కొందరు కాంగ్రెసు నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటూ ప్రస్తుతం ఉన్న సీటీని కాపాడుకోలేక తంటాలు పడుతుందని, జంటనగరాల అభివృద్ధి గాలికి వదిలారని అన్నారు. సాయంత్రం పూట వాకింగ్ పోతే పక్కవారితో మాట్లాడితే వారి నోట్లోకి దోమలు దూరుతున్నాయని అన్నారు. ఇప్పటికయినా  ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యల మీద దృష్టి సారించాలని కోరారు.అలాగే ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపు డెక్క ఆకును రెండు,మూడు రోజుల్లో తొలగించి అనంతరం చుట్టుపక్కల కాలనీల దోమల స్ప్రే చేయించడం జరుగుతుందని కాలనీ వాసులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, భారాస నాయకులు, కాలనీ పెద్దలు పాల్గోన్నారు.

About The Author