పేదల గూడు కూల్చేస్తారా?

  • వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాల్సిందే
  • రంగారెడ్డి అదనపు కలెక్టర్‌కు తెలంగాణ జాగృతి వినతి
  • పునరావాసం చూపకుండా కూల్చివేతలేంటి?
  • ​కవిత అరెస్టును ఖండించిన నేతలు..

పేదల గూడు కూల్చేస్తారా?

రంగారెడ్డి:

 ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇళ్లను అమానవీయంగా కూల్చివేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్‌కు జాగృతి నేతలు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వల్ల పేదలు రోడ్డున పడ్డారని వారు మండిపడ్డారు.

​సామాజిక న్యాయానికి గొడ్డలిపెట్టు:
​కనీస ప్రత్యామ్నాయం చూపకుండా, ఆశ్రయం కల్పించకుండా ఇళ్లను నేలమట్టం చేయడం సామాజిక న్యాయానికి విరుద్ధమని జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కె.శివశంకర్ విమర్శించారు. భూదాన్ ఉద్యమ ఆశయాలనే ప్రభుత్వం మంటగలుపుతోందని ధ్వజమెత్తారు. బాధితులకు అండగా నిలిచిన కల్వకుంట్ల కవితను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కేవలం 311 మందికి టోకన్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడటం సరికాదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

​జాగృతి ప్రధాన డిమాండ్లు ఇవే..
​తక్షణ పునరావాసం: నిరాశ్రయులైన పేద కుటుంబాలన్నింటికీ మానవీయ కోణంలో వెంటనే ఇళ్లు/స్థలాలు కేటాయించాలి.

​నిరంకుశత్వం వద్దు: అధికారుల ఇష్టారాజ్యంగా కాకుండా, బాధితులతో చర్చించి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా సమస్యను పరిష్కరించాలి.

​కేసులు ఎత్తివేయాలి: న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న వారిపై పెట్టిన అక్రమ కేసులు, వేధింపులను తక్షణమే నిలిపివేయాలి.

​ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు రయకంటి జగన్, అన్నబోయిన శ్రీశైలం, విజయ భార్గవ రెడ్డి, సిహెచ్. వీరేష్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author