ప్రతీ మహిళ సమాజంలో ఆర్థికంగా, గౌరవంగా బ్రతకాలి..
మహిళలందరి ముఖంలో చిరునవ్వులుండాలి..ఆర్ఆర్డిసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందికంటి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లోని గౌడ సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవా రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న మహిళలకృషిని గుర్తిస్తూ మహిళా పోలీసులను, జీహెచ్ఎంసీ మహిళా కార్మికులను శాలువాలు కప్పి సన్మానించారు. సమాజ శ్రేయస్సు కోసం వారు నిర్విరామంగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అభినందిస్తూ, వారి సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక సాధికారత కుటుంబానికి వెలుగు దీపిక వంటిదని, సమాజంలో స్త్రీలు గౌరవంగా జీవించాలంటే విద్యా, ఉపాధి రంగాలలో వారు ముందుకు రావాలని పేర్కొన్నారు.స్త్రీ శక్తి సమాజానికి బలం అని, స్త్రీ సాధికారతే అభివృద్ధికి మార్గమని ఆయన అన్నారు.సీఎం ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను లక్ష్యంగా తీసుకుని ఆడబిడ్డల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు హైటెక్ సిటీలో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసి 140కి పైగా స్టాల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన గ్రామీణ కుటీర పరిశ్రమల ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.అలాగే గడిచిన రెండున్నరేళ్లలో డ్వాక్రా మహిళా సంఘాలకు సుమారు 23 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు తెలిపారు.కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసే లక్ష్యంతో మహిళా సంఘాలను పెద్ద వ్యాపారాల్లోకి తీసుకురావడానికి పెట్రోలు బంకులు, బస్సులు, డైరీ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రత్యేక మహిళా బజార్లు వంటి పలు కార్యక్రమాల ద్వారా వారికి ఆదాయం పెరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు.
కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమని కొనియాడారు. విద్యా రంగంలో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఎంతో మంది మహిళలు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో చేరి దేశానికి సేవలందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రతి మహిళ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సుస్మిత మాజీ కార్పోరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న గౌడ్,బద్దుల వేణుగోపాల్ యాదవ్, దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి తులసి శ్రీనివాస్, బబ్బూరి ఆనంద్ గౌడ్ , బేర బాలకిషన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, నాయకులు కోటగిరి శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు వసంత, మహిళా పోలీసులు, జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
