అక్షర టౌన్ షిప్ లో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం..

  • కెనాల్స్ అస్థిత్వం కోల్పోయే ప్రమాదం?
  • డి93 కెనాల్ నుంచి దిగువకు నిరంధే పరిస్థితి లేదు..
  • అధికారుల తీరుపై ప్రజల అసంతృప్తి

అక్షర టౌన్ షిప్ లో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం..

కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ కు అతి సమీపంలోని అక్షర టౌన్ షిప్ పేరిట వెంచర్ వెలిసింది. ఈ టౌన్ షిప్  విషయంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణమేంటీ..? తమ పరిధిలోని కెనాల్స్ పరిరక్షణతో పాటు ఆయాకట్టు కు నీరందించే బాధ్యతలను నిర్వర్తించాల్సిన అధికారులు అంటీ ముట్టనట్టుగా నడుచుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. కెనాల్స్ అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ తీవ్రంగా పరిగణించకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. అక్షర టౌన్ షిప్ పై భారతశక్తి ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం...

అప్పుడలా...
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు దుర్గా మాత ఆలయానికి వెనక భాగం నుండి కరీంనగర్ దిగువ ప్రాంతానికి SRSP డి93 కెనాల్ నిర్మాణం చేశారు అధికారులు. ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మీదుగా ఆయా కట్టుకు నీరందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కెనాల్ నుంచి నగునూరు, తీగలగుట్టపల్లి. వల్లంపహాడ్ గ్రామాల మీదుగా మెన్ కెనాల్ కు అనుసంధానం చేశారు. అయితే కెనాల్ ను ఆనుకుని ఉన్న భూమిలో అక్షర టౌన్ షిప్ పేరిట వెంచర్ ప్రారంభించడం సంచలనంగా మారింది. ఈ విషయం వెలుగులోకి రాగానే టౌన్ షిప్ కోసం కెనాల్ రోడ్డును శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చేసుకున్న దరఖాస్తులో చూపించుకున్నారని తేలింది. దీంతో ఇరిగేషన్ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో ఇక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. వెంచర్ కోసం భూమిని చదును చేస్తున్న క్రమంలో ఛానెల్స్ కూడా ధ్వంసం అయ్యాయని తేలినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పటి ఇరిగేషన్ అధికారులు కెనాల్ మీదుగా రైతుల ముసుగులో బీటీ రోడ్డు వేస్తున్నా, ఇరిగేషన్ విభాగానికి చెందిన డిస్ట్రిబ్యూటరీ ఛానెల్స్ ధ్వంసం అయినా పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. ఈ విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు శాఖ పరంగా విచారణ జరిపారో లేదో వారికే తెలియాలి. కేవలం పోలీసులకు పిర్యాదు చేసి చేతులు దులుపుకున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది.ghg

ఇప్పుడిలా...
అక్షర టౌన్ షిప్ వెంచర్ విషయంలో సుడాకు లేఖ రాసి అనుమతులు రద్దు చేయాలని, తమ శాఖ నుండి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతే మళ్లీ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ లేఖ రాశామని పేర్కొంటున్నారు. అయితే అక్షర టౌన్ షిప్ లో సీసీ రోడ్లతో పాటు ఇతరాత్ర నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డు మీదుగానే మిషన్లు, సిమెంట్, కాంక్రీట్ రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. కేవలం వ్యవసాయ అవసరాలకు సంబంధించిన వాటిని మాత్రమే కెనాల్ రహదారి మీదుగా తరలించుకపోయేందుకు అనుమతి ఉంటుంది కానీ అక్షర టౌన్ షిప్ వెంచర్ లో నిర్మాణాలకు అవసరమైన మెటిరియల్ తీసుకెళ్తున్నా అడ్డుకోకపోవడం కానీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయకపోవడం వెనక అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. బాహాటంగానే వెంచర్ లో రోడ్ల నిర్మాణాలు చేస్తూ... ప్లాట్లు విక్రయిస్తామన్న ప్రచారం కూడా చేస్తుండడం గమనార్హం. కమర్షియల్ అవసరాల కోసం కెనాల్ రోడ్డును వినియోగిస్తున్నట్టుగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారన్నదే విచిత్రంగా ఉంది.

వారంతా...
కాలువలను పర్యవేక్షించే ఉద్యోగులు, ఇంజనీరింగ్ అధికారులు ఇంత మంది ఉన్నా అక్షర టౌన్ షిప్ లో దర్జాగా సాగుతున్న అభివృద్ది పనులను కట్టడి చేసే వారు లేకుండా పోయారన్న ఆరోఫణలు వినిపిస్తున్నాయి. ఈ వెంచర్ లో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం అయితే రానున్న కాలంలో మిగతా భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగనుంది. దీనివల్ల కాలువల అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడనుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి సాగు నీరు అందే పరిస్థితి కూడా ఉండదు.

About The Author

Related Posts