టీజీపీఎస్సీ గరిష్ట వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలి
ఎల్బీనగర్:
తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపిఎస్సీ) ద్వారా విడుదలవుతున్న నియామక నోటిఫికేషన్లలో గరిష్ట వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 44 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వివేకానంద గౌడ్ ఇరువురు కలిసి టీజీపిఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అమలులో ఉన్న జీవో 42 ప్రకారం 46 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉండేదని, అనంతరం జారీ చేసిన జీవో 86 ద్వారా 44 సంవత్సరాలకు పరిమితం చేయడం వల్ల అనేక మంది అర్హులైన అభ్యర్థులు అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.రాష్ట్రంలో అనేక శాఖల్లో చాలా సంవత్సరాల తర్వాత నియామక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయని,ముఖ్యంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డిఈఓ), డిగ్రీ కళాశాల లెక్చరర్ వంటి పోస్టులకు సుదీర్ఘ విరామం తర్వాత నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. క్రమబద్ధమైన వార్షిక నియామక క్యాలెండర్ లేకపోవడం వల్ల పీజీ , పీహెహెచ్ డి వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అనేక మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.అత్యుత్తమ విద్యార్హతలు, విషయ పరిజ్ఞానం మరియు అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం అనేక మంది అభ్యర్థులు తక్కువ వేతనాలతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని వారికి కూడా ప్రభుత్వ సేవలో చేరే అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం అవసరమని కోరారు.అదేవిధంగా దరఖాస్తు రుసుమును ప్రస్తుతం ఉన్న రూ.1000 నుండి రూ.100కు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ యువతపై భారం తగ్గించి, ఎక్కువ మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు.ప్రభుత్వం మరియు టీజీపిఎస్సీ అధికారులు ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖరరెడ్డి, ఇంద్ర నాయక్ పాల్గొన్నారు.
