*సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి.

  • *కల్వకుర్తి, పాలమూరు, దిండి పురోగతిపై కమిషనర్ శివకుమార్ నాయుడు సమీక్ష.
  • *పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం.

*సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి.

*హైదరాబాద్:

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి, భూసేకరణ (R&R & LA) కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
అంతకుముందు కలెక్టరేట్‌కు విచ్చేసిన కమిషనర్‌కు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) అనంత్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) సునీల్ స్వాగతం పలికారు.

*సమన్వయంతో పనిచేయాలి
సమీక్షా సమావేశంలో భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో కమిషనర్ విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈలు), ఆమనగల్లు, మాడ్గుల్ తహసీల్దార్లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author