ఎల్బీనగర్ సర్కిల్ 13 లో అక్రమ నిర్మాణాలను సీజ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు
- *అక్రమ నిర్మాణాలపై ఏసీపీ అంబికా శ్రీ ‘మార్క్’.. రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ బృందం!
- *ఎల్బీనగర్ సర్కిల్ 13లో భారీగా సీజ్ చేసిన అధికారులు..
- నిబంధనలు ఉల్లంఘిస్తే ఊపేక్షించేది లేదు!
ఎల్బీనగర్:
వచ్చి రాగానే అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ నయా బాస్ తన కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మించే భవనాలపై ఉక్కుపాదం మోపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ACP) అంబికా శ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు సిబ్బందితో కలిసి నిలిపివేసి, సీజ్ చేశారు.
*అనుమతి ఒకదానికి.. నిర్మాణం మరొకదానికి!
ఎల్బీనగర్ సర్కిల్ 13 పరిధిలోని దుర్గా నగర్ కాలనీలో నివాస గృహాల (Residential) కోసం అనుమతులు తీసుకుని, కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కి కమర్షియల్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన ఏసీపీ అంబికా శ్రీ నేతృత్వంలోని బృందం సదరు భవనాన్ని పూర్తిగా సీజ్ చేసింది. అదేవిధంగా, నిర్మల కాలనీ మరియు మైత్రి పురంలోని పలు అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు గుర్తించి, వాటిపై సీజింగ్ బోర్డులను తగిలించారు.
*అంబికా శ్రీ (టౌన్ ప్లానింగ్ ఏసీపీ)
*రంగంలోకి టౌన్ ప్లానింగ్ యంత్రాంగం
ఈ ఆకస్మిక దాడులు మరియు సీజింగ్ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ అంబికా శ్రీతో పాటు టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ పాండు నాయక్, చైన్ మెన్ రవీందర్ గౌడ్, రఘు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు. నూతన అధికారిణి బాధ్యతలు చేపట్టగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో కూడా ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
