*నగరంలో ‘హైడ్రా’ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
*ఆక్రమణలు, పూడికతోనే వరద ముంపు.. యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశం
*హైదరాబాద్:
ఇటీవల కురిసిన తొలి వర్షానికే ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవడాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద ముంచెత్తిన మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. నీరు నిలిచిపోవడానికి గల సాంకేతిక, సహజ కారణాలను స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల రామయ్యతో పాటు అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*బాక్స్ డ్రైన్ల మూసివేతతోనే ముంపు..
కొండాపూర్ నుంచి మొండికుంట వైపు వెళ్లాల్సిన వరద నీరు మీనాక్షి టవర్స్ సమీపంలో నిలిచిపోవడానికి ప్రధాన కారణం అక్కడి కాంక్రీట్ బాక్స్ డ్రైన్ల (పెద్ద వరద కాలువల)పై పూర్తిగా స్లాబ్ వేసి మూసివేయడమేనని అధికారులు గుర్తించారు. దీనివల్ల లోపల పేరుకుపోయిన పూడికను తీయడానికి వీల్లేకుండా పోయింది. దీనికితోడు మీనాక్షి టవర్స్ వద్దకు వచ్చేసరికి వరద కాలువ మరింత కుంచించుకుపోయింది. దీనిపై స్పందించిన కమిషనర్.. వెంటనే సదరు స్లాబులను తెరిపించి, పూడికను పూర్తిగా తొలగించాలని, అవసరమైతే కాలువను విస్తరించాలని ఆదేశించారు..jpeg)
గచ్చిబౌలి ప్రధాన రహదారిలోని బయోడైవర్సిటీ పార్కు పరిసరాలు జలమయం కావడానికి ఖాజాగూడ, మల్కం చెరువులకు వెళ్లే వరద నీటి ఇన్‌లెట్లు (ప్రవేశ మార్గాలు) సక్రమంగా లేకపోవడమేనని తేలింది. ఈ ప్రవేశ మార్గాలను రెండు రోజుల్లోగా పునరుద్ధరించాలని కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే, వర్షపు నీటితో పాటు కొట్టుకొచ్చిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు నాలాలకు అడ్డుపడటం వల్లే రహదారులపై నీరు నిలిచిందని గుర్తించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలో పూడుకుపోయిన నాలా, మ్యాన్‌హోల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
*రెండు రోజుల్లో పనులు పూర్తి కావాలి!
"వరద నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్న ప్రతీ అడ్డంకిని తొలగించాలి. ఎక్కడికక్కడ పూడికతీత పనులను పూర్తి చేసి, రాబోయే వర్షాలకు నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి."
*హైడ్రా కమిషనర్ ఆదేశం
నెక్టార్ గార్డెన్స్ వద్ద లోపం: వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు (SNDP)లో భాగంగా నిర్మించిన బాక్స్ డ్రైన్‌కు, గతంలో ఉన్న పాత లైన్లను సరిగ్గా అనుసంధానం చేయకపోవడం వల్లే మాదాపూర్ నెక్టార్ గార్డెన్స్ రహదారులు చెరువులను తలపించాయి. ప్రస్తుతం ఈ లింకేజ్ పనులతో పాటు రహదారి నీరు కాలువలోకి వెళ్లేలా ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. అలాగే దుర్గం చెరువులో నీటి సామర్థ్యాన్ని కొంత తగ్గించడం ద్వారా ఈ ప్రాంతంలో వరద ముప్పును అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మియాపూర్ లో ఆక్రమణలు:
మియాపూర్ పరిధిలోని గురునాథ్ చెరువుకు వెళ్లే వరద కాలువలు ఆక్రమణలకు గురికావడంతోనే జేపీ నగర్ చౌరస్తా, లక్కీ హోటల్ పరిసరాలు నీట మునిగాయి. ప్రిమార్క్ సుంకృతి అపార్ట్‌మెంట్ సమీపంలో కాలువను పూర్తిగా మూసివేయడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. దీనికి తోడు, ఇటీవల కొత్తగా నిర్మించిన రహదారుల వల్ల వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి.
నగరంలోని అన్ని వరద కాలువలను తక్షణమే పునరుద్ధరించి, ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా సమర శంఖం పూరించింది. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు.
