కాంగ్రెస్‌ హామీలు గాలికి.. వంచనలో సర్కార్‌ రికార్డు!

  • ​26 నెలలైనా తీరని మహిళల, వృద్ధుల నిరీక్షణ
  • ​తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్‌ హామీలు గాలికి.. వంచనలో సర్కార్‌ రికార్డు!

​రంగారెడ్డి జిల్లా:
ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం కొలువుదీరి 26 నెలలు గడుస్తున్నా, ప్రధాన హామీల అమలులో దారుణమైన జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

​మహాలక్ష్మి ఎక్కడ? వృద్ధుల భరోసా ఏది?
​మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా మహిళలకు ₹2500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండేళ్లు దాటినా ఆ ఊసే ఎత్తకపోవడం మహిళా లోకాన్ని వంచించడమేనని పాండురంగా రెడ్డి మండిపడ్డారు. 

అలాగే:
​పింఛన్ల పెంపు: వృద్ధాప్య పింఛన్ ₹4000లకు, దివ్యాంగుల పింఛన్ ₹6000లకు పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

​అమలుకాని హామీలు: ఆడబిడ్డ వివాహానికి తులం బంగారం,

 చదువుకునే విద్యార్థినులకు స్కూటర్ల పంపిణీ వంటి వాగ్దానాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
​ఉద్యమకారుల ఆత్మగౌరవంపై నిర్లక్ష్యం
​తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పింఛన్ల విషయంలో హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన కనీస బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు.

​బడ్జెట్‌లో కేటాయింపులు లేకుంటే ఉద్యమమే..

​"కుంటి సాకులు మానుకొని, తక్షణమే పెంచిన పింఛన్లు, మహిళలకు నగదు బదిలీని ప్రారంభించాలి. రాబోయే బడ్జెట్‌లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు రైతులకు ఇచ్చిన హామీల కోసం నిధులు కేటాయించాలి" అని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పాండురంగా రెడ్డి హెచ్చరించారు.

About The Author