రంజాన్ వేళ నగరం తళతళలాడాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్

చార్మినార్ జోన్‌లో పారిశుద్ధ్య పనుల క్షేత్రస్థాయి తనిఖీ

రంజాన్ వేళ నగరం తళతళలాడాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్ :

రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా, ప్రభావవంతంగా జరిగేలా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను జోనల్, డిప్యూటీ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.

​బుధవారం ఆయన అదనపు కమిషనర్ (సానిటేషన్) రవికిరణ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి చార్మినార్ జోన్‌ పరిధిలోని మక్కా మసీదు, మదీనా, చార్మినార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

​అధికారులకు కమిషనర్ జారీ చేసిన కీలక ఆదేశాలు:

​ప్రత్యేక నిఘా: రంజాన్ సందర్భంగా జనసంచారం విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రార్థనా స్థలాల వద్ద ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలి.

​సిబ్బంది మోహరింపు: అవసరమైన చోట అదనపు సిబ్బందిని కేటాయించి, రూట్ మ్యాప్ ప్రకారం పని విభజన జరగాలి.

​రియల్ టైమ్ మానిటరింగ్: పారిశుద్ధ్య పనుల్లో నాణ్యతను పెంచేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి.

​మార్కెట్లలో క్లీనింగ్: వాణిజ్య, మార్కెట్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా రాత్రిపూట కూడా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలి.
​డ్రైనేజీల నిర్వహణ: డ్రైన్లు పొంగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

​సహకరించండి:
నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పౌరులు, వ్యాపారులు పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో చార్మినార్ డిప్యూటీ కమిషనర్ సరితతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author