యువతకు నైపుణ్య శిక్షణ,ఉపాధి కల్పన
- హుజూర్నగర్ లో 40 కోట్ల రూపాయలతో ఏటిసి,ఆరు కోట్ల రూపాయలతో ఐటిఐ కళాశాల నిర్మాణం
- ఏ టి సి కి పలు సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు
- రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట:
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లను ఏర్పాటు చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఐటిఐ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని బుధవారం మంత్రి పర్యవేక్షించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటీసీ ద్వారా అందించే శిక్షణలో ఆటోమేషన్, రొబోటిక్స్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, 3డి లెజర్ ప్రింటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, సిఎన్ సి మిషన్ టెక్నీషియన్ లాంటి ఆధునిక కోర్సులు ఉన్నాయని 2025-26 సంవత్సరం లో 172మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని వారందరికీ నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో రోబోటిక్స్ లో శిక్షణ తీసుకుంటున్న లింగగిరి గ్రామానికి చెందిన శ్రీలత, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ లో శిక్షణ తీసుకుంటున్న రాయనిగూడెం గ్రామానికి చెందిన ఉషారాణి, శ్రావణి లతో మాట్లాడినారు.అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కల్పించేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో త్రాగునీటి వసతి,టాయిలెట్స్ ఏర్పాటు, రవాణా సదుపాయం కల్పించేందుకు వెంటనే నిధులు మంజూరు చేస్తానని మంత్రి ప్రకటించారు.
అనంతరం 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఐటిఐ కళాశాల భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి నాణ్యత పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేసి , జూన్ నాటికి తరగతి గదులు నిర్వహించేలా అందుబాటులోకి తీసుకొని రావాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పి కే నరసింహ, ఏటీసీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ రెడ్డి,అధ్యాపకులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు
